Spain: ముద్దు తెచ్చిన తంటా.. పదవి కోల్పోయిన ఫుట్‌బాల్‌ చీఫ్

దేశానికి విజయం సాధించిపెట్టిన క్రీడాకారిణుల(FIFA Women's World Cup)తో అనుచితంగా ప్రవర్తించి బుక్కయ్యారు ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్. తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో చివరకు ఆ పదవి కోల్పోయారు. 

Published : 11 Sep 2023 10:38 IST

మాడ్రిడ్‌: తన దేశం ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌(FIFA Women's World Cup)ను తొలిసారి గెలిచిందన్న ఆనందంలో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్(Spanish soccer federation president) ప్రదర్శించిన అత్యుత్సాహం.. ఆయన పదవికే ఎసరు తెచ్చింది. సంబరాల్లో భాగంగా క్రీడాకారిణిని ముద్దాడి.. చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పటికే తన పదవి నుంచి సస్పెండైన ఆయన.. ప్రస్తుతం రాజీనామాను సమర్పించారు.

ఆగస్టు నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి స్పెయిన్(Spain) ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను తొలిసారి అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ.. స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌(Luis Rubiales) క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో (Jenni Hermoso)ను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారడంతో స్పెయిన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.

యుఎస్‌ ఓపెన్‌లో కొత్త యువరాణి

ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది. క్రీడాకారిణి అంగీకారంతోనే చుంబించినట్లు లూయిస్‌ తెలపగా.. అందుకు తాను అంగీకరించలేదంటూ హెర్మోసో స్పందించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఫిఫా (FIFA) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇక ఆదివారం అర్ధరాత్రి రూబియాలెస్‌ తన రాజీనామాను ప్రకటించారు. ‘ఫిఫా విధించిన సస్పెన్షన్ వేటు, నాపై నమోదైన కేసులు కారణంగా.. నేను ఈ పదవిలోకి తిరిగిరాలేనని స్పష్టమవుతోంది’ అంటూ తన రాజీనామా లేఖలో వెల్లడించారు. ఆయన 2018లో ఫెడరేషన్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవితో పాటు యూనియన్‌ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్‌(UEFA) ఉపాధ్యక్ష బాధ్యతలనుంచి కూడా వైదొలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని