యుఎస్‌ ఓపెన్‌లో కొత్త యువరాణి

గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాలనే ఆశ! స్వదేశంలో యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌. ప్రత్యర్థితో పోరు అంత సులువు కాదు. చూస్తుండగానే తొలి సెట్‌ పోయింది.

Published : 11 Sep 2023 04:24 IST

కొకో గాఫ్‌కు తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌
ఫైనల్లో సబలెంకకు షాక్‌

గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాలనే ఆశ! స్వదేశంలో యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌. ప్రత్యర్థితో పోరు అంత సులువు కాదు. చూస్తుండగానే తొలి సెట్‌ పోయింది. నిరీక్షణ తప్పదా.. విజయం దరిచేరదా? అనే అనుమానాలు. ఆశ, నిరాశల మధ్య ఊగిసలాట!

కానీ అప్పుడే ఆమెలోని అత్యుత్తమ క్రీడాకారిణి నిద్రలేచింది. ఇంతకంటే మంచి సమయం దొరకదంటూ కోర్టులో చెలరేగింది. పట్టువదలకుండా పోరాడింది. ప్రత్యర్థికి భయం కలిగించేలా.. అభిమానులకు   ఉత్సాహాన్ని అందించేలా.. అద్భుతమైన ఆటతో సాగిపోయింది!

ఇంకేముంది.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వచ్చి వాలింది. అవును.. అమెరికా చిన్నది కొకో గాఫ్‌ సాధించింది. అడ్డంకులను దాటి అదరగొట్టింది. ఈ 19 ఏళ్ల అమ్మాయి కెరీర్‌లో తొలి ప్రధాన టైటిల్‌ను దక్కించుకుంది. యుఎస్‌ ఓపెన్‌లో కొత్త యువరాణిగా ట్రోఫీని ముద్దాడింది.

న్యూయార్క్‌

యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌ వచ్చింది. సొంతగడ్డపై కోకో గాఫ్‌ విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ గాఫ్‌ 2-6, 6-3, 6-2తో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌)పై విజయం సాధించింది. తొలి సెట్‌ కోల్పోయినా.. గెలవాలన్న కసితో గొప్పగా పుంజుకున్న గాఫ్‌ విజయతీరాలకు చేరింది. రెండు గంటల ఆరు నిమిషాల్లో మ్యాచ్‌ ముగించింది. తొలి సెట్‌లో గాఫ్‌ పోరాడినా.. ఆధిపత్యమంతా సబలెంకాదే. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడంతో పాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లో సెమీస్‌ వరకూ వెళ్లిన 25 ఏళ్ల సబలెంక దూకుడు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన ఆమె 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఆ తర్వాతి రెండు గేమ్‌లు నెగ్గిన గాఫ్‌ స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి సబలెంక ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. గాఫ్‌ తప్పిదాలను ఉపయోగించుకుంటూ అయిదు, ఏడు గేమ్‌ల్లో ఆమె బ్రేక్‌ సాధించింది. వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి సెట్‌ ముగించింది. మధ్యలో ఆరో గేమ్‌లో సబలెంక సర్వీస్‌ను రిటర్న్‌ చేసిన గాఫ్‌.. ఆ తర్వాత బంతిని తిరిగి పంపించడంలో గొప్ప పట్టుదల చూపించింది. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పరుగెత్తుతూ అయిదు సార్లు బంతిని తిరిగి పంపించింది. కానీ చివరకు నెట్‌ దగ్గర నిలబడి సబలెంక బంతి బౌన్స్‌ అయ్యేలా ఫోర్‌హ్యాండ్‌ స్మాష్‌ విన్నర్‌ కొట్టి పాయింట్‌ సాధించింది.

ఆ తర్వాతే అసలు ఆట..: తొలి సెట్‌ పోయిందని గాఫ్‌ డీలా పడలేదు. దెబ్బతిన్న సివంగిలా లేచి నిలబడింది. రెండో సెట్‌ నుంచి అద్భుత ప్రదర్శనతో సాగింది. కోర్టులో మెరుపు వేగంతో పరుగెడుతూ గాఫ్‌ ప్రదర్శించిన డిఫెన్స్‌ నైపుణ్యాలు మెచ్చుకోవాల్సిందే. సబలెంక శక్తిని కోల్పోయినట్లు కనిపించగా.. గాఫ్‌ వేగాన్ని అందుకుంది. కోర్టు బయటకు లేదా పక్కకు, నెట్‌కు బంతిని కొడుతూ సబలెంక పాయింట్లు సమర్పించుకుంది. రెండో సెట్‌లో 1-1తో స్కోరు సమమైన తర్వాత గాఫ్‌ జోరు మొదలైంది. బలమైన బ్యాక్‌హ్యాండ్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, శక్తిమంతమైన సర్వీస్‌లతో ఆమె సాగిపోయింది. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె.. ఆపై 4-1తో దూసుకెళ్లింది. అదే ఊపులో సెట్‌ గెలిచి, మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు మళ్లించింది. ఇందులోనైతే గాఫ్‌ దూకుడు మాములుగా సాగలేదు. సబలెంకను సాధారణ క్రీడాకారిణిగా మార్చేస్తూ గాఫ్‌ రెచ్చిపోయింది. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 4-0తో విజయం వైపు సాగిపోయింది. మధ్యలో సబలెంక రెండు గేమ్‌లు నెగ్గినా ఆ ఆనందం కాసేపే. మళ్లీ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి గాఫ్‌ విజేతగా నిలిచింది. బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌ ముగించిన ఆమె కోర్టులో వాలిపోయింది. ప్రేక్షకుల కేరింతలతో మార్మోగిన స్టేడియంలో కన్నీళ్లలో మునిగిపోయింది. టైటిల్‌ దక్కకపోయినా సబలెంకకు మాత్రం నంబర్‌వన్‌ ర్యాంకు లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు