Ruturaj Gaikwad: గతేడాది ‘ఫైనల్‌’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్‌ గైక్వాడ్

ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది.

Published : 19 May 2024 09:50 IST

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై ఐపీఎల్ 17వ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. కీలకమైన పోరులో 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 27 పరుగుల తేడాతో సీఎస్కే ఓడింది. కనీసం 201 పరుగులు చేసినా చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరేది. కానీ, 191 పరుగులకే పరిమితం కావడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్ రుతురాజ్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. బెంగళూరుతో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా మారిందని రుతురాజ్‌ (Ruturaj Gaikwad) అభిప్రాయపడ్డాడు. టోర్నీ ఆసాంతం చాలా సవాళ్లను ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు. 

‘‘పిచ్ స్పిన్నర్లకు సహకరించింది. తేమ పరిస్థితుల్లోనూ వారికి గ్రిప్‌ దొరికింది. మా ముందున్న లక్ష్యం పెద్దదేమీ కాదు. విజయం సాధిస్తామని భావించాం. నెట్‌రన్‌రేట్‌ను కాపాడుకుంటామని అనుకున్నా సాధ్యపడలేదు. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచులను కొద్దిలో చేజార్చుకున్నాం. అయినా 14 మ్యాచుల్లో ఏడు గెలిచినందుకు ఆనందంగానే ఉంది. కీలకమైన బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో లేరు. డేవన్ కాన్వే సేవలను మిస్‌ అయ్యాం. పతిరన గాయం కారణంగా కొన్ని మ్యాచులు ఆడలేదు. ముస్తాఫిజుర్‌ను ఆఖర్లో కోల్పోయాం. గాయాలు, గైర్హాజరీలతో జట్టు సమతూకం లేకుండా పోయింది. ఇవే మా ఓటమికి కారణమని చెప్పను కానీ, ఈ సీజన్‌లో మాకు ఎదురైన అనుభవాలు ఇవీ. నేనెప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడను. జట్టు విజయం సాధించిందా? లేదా? అనేదే ముఖ్యం. సీజన్‌లో 500+ స్కోరు చేసినా రాని ఆనందం జట్టు విజేతగా నిలిస్తే కలుగుతుంది.

ఈసారి మేం ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినందుకు వ్యక్తిగతంగా చాలా బాధేస్తోంది. గతేడాది ఫైనల్‌లో మేం చివరి రెండు బంతులకు 10 పరుగులు చేసి ఛాంపియన్‌గా నిలిచాం. మరోసారి అదే పునరావృతం అవుతుందని ఆశతో ఉన్నా. కానీ యశ్‌ దయాళ్‌ చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బంతులేశాడు. కీలకమైన ముగ్గురు ప్లేయర్లు జట్టులో లేకపోయినా మేం ఇంతదాకా పోరాడాం. దీనికి ప్రధాన కారణంగా సీఎస్కే స్టాఫ్. వారి తర్ఫీదులోనే రాటుదేలాం.  ’’ అని రుతురాజ్ వెల్లడించాడు. గుజరాత్‌తో గతేడాది ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ రవీంద్ర జడేజా సిక్స్‌, ఫోర్ కొట్టి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని