Ruturaj Gaikwad: కేఎల్‌ను అధిగమించి.. భారత ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌గా నిలిచిన రుతురాజ్‌ గైక్వాడ్

చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అరుదైన ఘనత సాధించాడు. ముంబయిపై కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అతడు ఐపీఎల్‌లో రెండు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు.

Updated : 15 Apr 2024 09:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై బయటి మైదానాల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (69) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని తాకాడు. చెన్నై తరఫున రెండు వేలు అంతకంటే ఎక్కువ చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. రుతురాజ్‌కు (Ruturaj Gaikwad) ముందు డుప్లెసిస్ (92 మ్యాచుల్లో 2,721 పరుగులు), ఎంఎస్ ధోనీ (226 మ్యాచుల్లో 4,547 ), సురేశ్‌ రైనా (176 మ్యాచుల్లో 4,687) ఉన్నారు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన తొలి భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. రుతురాజ్‌ కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. 

ప్రస్తుతం రుతురాజ్‌ 2,021 పరుగులు పూర్తిచేశాడు. సీఎస్‌కే తరఫున అతడు 2020లో అరంగేట్రం చేశాడు. మరుసటి సీజన్‌లో అదరగొట్టాడు. మొత్తం 16 మ్యాచుల్లో 136.26 స్ట్రైక్‌రేట్‌తో 635 రన్స్‌ చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాది ‘ఆరెంజ్ క్యాప్‌’ను అందుకొన్నాడు. గతేడాది చెన్నై ఐదోసారి ఛాంపియన్‌గా నిలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 224 రన్స్‌ చేశాడు. వేగంగా రెండు వేల పరుగుల రికార్డులో మొత్తంగా క్రిస్‌ గేల్ (48 ఇన్నింగ్స్‌లు), షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్‌లు) టాప్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్ (60 ఇన్నింగ్స్‌లు) ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఈ జాబితాలో టాప్‌ బ్యాటర్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని