Sachin Tendulkar: ఈ అమీర్‌ రియల్‌ హీరో.. చెప్పినట్లుగానే పారా క్రికెటర్‌ను కలిసిన సచిన్‌

Sachin Tendulkar: కశ్మీర్‌కు చెందిన దివ్యాంగ క్రికెటర్‌ అమీర్‌ హుస్సేన్‌ను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కలిశారు. అతడు రియల్‌ హీరో అంటూ మెచ్చుకున్నారు.

Updated : 24 Feb 2024 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు చేతులు లేకపోయినా క్రికెట్‌ ఆడుతూ అబ్బురపరుస్తున్నాడు జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు చెందిన అమీర్‌ హుస్సేన్‌ లోన్‌ (Amir Hussain Lone). ఈ పారా క్రికెటర్‌ ప్రతిభను చూసి ఇటీవల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఆశ్చర్యపోయారు. ఏదో ఒకరోజు అతడిని కలుస్తానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చెప్పినట్లుగా ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ తాజాగా అమీర్‌ను కలిశారు.

ప్రస్తుతం కశ్మీర్‌ పర్యటనలో ఉన్న సచిన్‌.. పారా క్రికెటర్‌ ( para cricketer) ఇంటికి వెళ్లారు. అతడిని అభినందించి తాను సంతకం చేసిన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఈ అమీర్‌ రియల్‌ హీరో. నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇలాగే ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ ఉండాలి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్‌ దిగ్గజం క్రీడా స్ఫూర్తిని పలువురు కొనియాడుతున్నారు. అమీర్‌ జీవితం ఎంతోమందిలో ప్రేరణ కలిగిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

8 ఏళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో అమీర్ తన రెండు చేతులూ కోల్పోయాడు. అయినా కుంగిపోలేదు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు క్రికెట్ ఆటవైపు ప్రోత్సహించారు. అలా పారా క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్‌ పట్టుకుని బ్యాటింగ్‌ చేస్తున్నాడు. షాట్లూ కొడుతున్నాడు. చేతిని తిప్పి వేసినట్లుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్‌ వేస్తున్నాడు. 2013 నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్న 34 ఏళ్ల అమీర్‌ ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని