Sachin - Arjun: ఓ తండ్రిగా.. అర్జున్‌కు సచిన్‌ ప్రత్యేక సందేశం

సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar) అరంగేట్రం కోసం గత రెండేళ్లుగా సచిన్‌ అభిమానులు ఎదురు చూశారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆ కోరిక  తీరిపోయింది.

Updated : 17 Apr 2023 11:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ చరిత్రలో (IPL) అరుదైన రికార్డును సచిన్‌ తెందూల్కర్ - అర్జున్‌ తెందూల్కర్‌ (Sachin - Arjun) సొంతం చేసుకున్నారు. సోదరులు ఆడినప్పటికీ.. ఇలా తండ్రీకుమారులిద్దరూ ఓ లీగ్‌లో ఆడటం తొలిసారి. కోల్‌కతాపై అరంగేట్రం చేసిన అర్జున్ తెందూల్కర్‌కు కెప్టెన్‌ సూర్యకుమార్‌ తొలి ఓవర్‌నే బంతినిచ్చాడు. రెండు ఓవర్లు వేసిన అర్జున్ వికెట్‌ లేకుండా 17 పరుగులు ఇచ్చాడు. విభిన్నమైన రనప్‌తో లైన్‌ లెంగ్త్‌కు కట్టుబడి బంతులను సంధించాడు. పవర్‌ప్లే కావడంతో బ్యాటర్లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టారు. ముంబయి రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకున్న అర్జున్‌ను ఉద్దేశించి సచిన్‌ తెందూల్కర్‌ ప్రత్యేకంగా సందేశం అందించాడు.

‘‘క్రికెటర్‌గా ప్రయాణంలో ఇవాళ నువ్వు మరో కీలకమైన ముందడుగు వేశావు. తండ్రిగా, క్రికెట్‌ ప్రేమికుడిగా ఎంతో ఆనందిస్తున్నా. ఆటకు నువ్వు గౌరవం తీసుకొచ్చేలా ఆడతావని నాకు తెలుసు. గేమ్‌ కూడా నీకు ప్రేమను అందిస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డావు. ఇదే శ్రమను కొనసాగించు. అద్భుతమైన ప్రయాణానికి ఇది ఆరంభం. ఆల్‌ ది బెస్ట్’’ అని అర్జున్‌ను ఉద్దేశించి సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ఆల్‌రౌండర్‌ అయిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ వేసే అవకాశం మాత్రమే వచ్చింది. ఇక బ్యాటర్‌గా తన సత్తా ఏంటో తెలియాలంటే మరికాస్త సమయం వేచి చూడాలి. గత రెండు సీజన్లలోనూ జట్టుతోపాటు ఉన్నప్పటికీ.. అర్జున్‌ తెందూల్కర్‌కు అవకాశం రాలేదు. ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్‌ నాయకత్వంలో అర్జున్ అరంగేట్రం చేసి బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని