Sachin: 22 ఏళ్లు ఆగా.. 21 ఓవర్లు ఆగలేవా? సచిన్‌ అన్న మాటలే వికెట్లు దక్కేలా చేశాయి: భారత పేసర్

అరంగేట్రంలో త్వరగా వికెట్‌ తీయలేకపోతే యువ క్రికెటర్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. అదే సమయంలో సీనియర్‌ ఇచ్చే సూచనలు ప్రభావం చూపిస్తుంటాయి.

Updated : 21 Mar 2024 21:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ క్రికెటర్లకు దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) స్ఫూర్తి. జట్టులో అతడితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది అటువంటి క్రికెటర్‌ నుంచి సలహాలు పొందితే కెరీర్‌ ఉన్నతస్థాయికి వెళ్లడం ఖాయం. అటువంటి ఆటగాళ్ల జాబితాలో వెటరన్ పేసర్ వరుణ్‌ ఆరోన్ ఉన్నాడు. తన తొలి టెస్టు సందర్భంగా సచిన్‌ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటల వల్లే వికెట్లు తీయగలిగినట్లు తాజాగా వెల్లడించాడు. 2011లో వరుణ్‌ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో దాదాపు 21 ఓవర్లపాటు వికెట్‌ తీయలేకపోయాడు. 

‘‘వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో భారత్‌ టెస్టు ఆడింది. ఇదే నాకు తొలి మ్యాచ్. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై విండీస్‌ 500 పరుగులకుపైగా చేసింది. అప్పటికి నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయింది. నేను 21 ఓవర్లు బౌలింగ్‌ చేశా. ఒక్క వికెట్‌ దక్కలేదు. మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సచిన్‌ వచ్చి ‘ఎందుకు నిరాశగా ఉన్నావు?’ అని అడిగాడు. నేను 21 ఓవర్లు వేసిన వికెట్‌ తీయలేకపోయా. నా అరంగేట్రంలోనే ఇలా జరగడం నమ్మలేకపోతున్నానని చెప్పా. దీంతో దగ్గరకు పిలిచాడు. ‘నేను నా తొలి వరల్డ్‌ కప్‌ కోసం 22 ఏళ్లు వేచి ఉన్నానని నీకు తెలుసా? నువ్వు నీ మొదటి వికెట్‌ కోసం 21 ఓవర్లు కూడా వేచి ఉండలేవా? ఇప్పుడేం ఇబ్బంది లేదు. ఊహల్లోకి వెళ్లకుండా నేలపైకి దిగిరా. నీ శైలిలో బౌలింగ్‌ వేస్తే చాలు’ అని ఉద్బోధించాడు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. 

ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే డారెన్ బ్రావో (166)ను ఔట్‌ చేశా. ఇదే మ్యాచ్‌లో కారిటన్ బా, డారెన్ సామీని కూడా పెవిలియన్‌కు చేర్చా. అలా నా అరంగేట్రం మారిపోయింది. మార్లన్‌ శామ్యూల్స్‌ వికెట్‌ను కూడా తీసే అవకాశం వచ్చింది. కానీ క్యాచ్‌ డ్రాప్‌ కావడంతో వికెట్‌ దక్కలేదు. ఒకవేళ ఆ వికెట్‌ కూడా వచ్చుంటే.. నాకు మరో ఓవర్‌ను కెప్టెన్ ధోనీ ఇచ్చి ఉండేవాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసే అవకాశం ఉండేది. సచిన్‌ స్ఫూర్తితోనే గొప్ప స్పెల్‌గా మారింది. కొన్ని చిన్న విషయాలే మన కెరీర్‌లో చాలా మార్పులు వస్తుంటాయి’’ అని ఆరోన్‌ తెలిపాడు. భారత్‌ తరఫున 9 టెస్టులు ఆడిన అతడు 18 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని