IND A vs PAK A: మరోసారి అంపైరింగ్‌పై తీవ్ర చర్చ.. సాయి సుదర్శన్‌ ఔటైంది ‘నోబాలా’..?

ఇటీవల అంపైర్‌ తప్పుడు నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ ఫైనల్లో(Emerging Asia Cup) సాయి సుదర్శన్‌(Sai Sudharsan) ఔటైన తీరుపై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

Updated : 24 Jul 2023 13:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గ్రూప్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్‌-ఎ జట్టు.. అసలైన కీలక సమరంలో చేతులెత్తేసింది. ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ ఫైనల్‌లో (Emerging Asia Cup Final) పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. భారత్‌- A జట్టును 128 పరుగుల తేడాతో పాకిస్థాన్‌- A ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కూడా టీమ్‌ఇండియా ఓటమికి కారణమయ్యాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) ఔటైన తీరును వారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. నోబాల్‌ అయినప్పటికీ.. అతడిని ఔట్‌గా ప్రకటించారని అంపైర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ ఔట్‌ వివాదాస్పదంగా మారింది.

పాక్‌ నిర్దేశించిన 353 పరుగుల భారీ ఛేదనకు దిగిన భారత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) 29 పరుగులు చేసి 9వ ఓవర్లో అర్షద్‌ ఇక్బాల్‌ బౌలింగ్‌లో మహమ్మద్‌ హారిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే.. అది నోబాల్‌ అని అభిమానులు పేర్కొంటున్నారు. రీప్లేలో బౌలర్‌ కాలు క్రీజ్‌ను దాటిందని సోషల్‌మీడియాలో విమర్శలు చేశారు. అయితే.. థర్డ్‌ అంపైర్‌ ఆ బంతిని లీగల్‌ డెలివరీగా ప్రకటించడం గమనార్హం.

టెస్టుల్లో డబుల్‌ డిజిట్స్‌.. తొలి బ్యాటర్‌గా ‘హిట్‌మ్యాన్‌’

సాయి సుదర్శన్‌ ఔట్‌ కాకుండా ఉండుంటే.. ఫలితం వేరేలా వచ్చేదని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ చేరిన వెంటనే.. మిడిల్‌ ఆర్డర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో 40 ఓవర్లలోనే భారత్‌-A 224 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ మొదట 8 వికెట్లకు 352 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఇక బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలోనూ అంపైర్‌ నిర్ణయంపై టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని