Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీకి మరో మార్గం లేకుండా చేశారు: సల్మాన్ భట్‌

విరాట్ కోహ్లీనే (Virat Kohli) కెప్టెన్సీని వదిలేశాడు.. లేదు అతడిని సాగనంపారు అనే వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్ కూడా విరాట్‌కు మద్దతుగా మాట్లాడాడు.

Updated : 16 Jun 2023 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ (Virat kohli) దిగిపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి బీసీసీఐ అధినాయకత్వంపై విభేదాలతోనే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అతడిని ఎవరూ తప్పించలేదని, తనకు తాను సారథ్య బాధ్యతలను వదిలేసినట్లు కామెంట్లు వచ్చాయి. వీటిపై పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ - బీసీసీఐ మధ్య క్రమంగా దూరం పెరగడంతో.. మరో మార్గం లేకనే కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్, ఆటగాడి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే సమస్య తలెత్తినట్లు అనిపించిందని తెలిపాడు.

‘‘కోహ్లీ విజయవంతమైన కెప్టెన్. అయితే, అతడిని ఒక్కో ఫార్మాట్‌ నుంచి తప్పించిన విధానం చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీనే కెప్టెన్సీని వదిలేశాడు.. ఎవరూ అతడిని తీసేయలేదని చాలా కామెంట్లు చదివా. అయితే, విరాట్ అలా చేయడానికి బోర్డే పరిస్థితులను సృష్టించింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు మేనేజ్‌మెంట్ తనతో సంప్రదింపులు జరపలేదని కోహ్లీ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడలేదా..? మీరంతా ఆ వీడియోను మరోసారి చూడండి. టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ నిష్క్రమణ జరగకుండా ఉంటే బాగుండేది. ప్రొఫెషనల్‌ ఆటగాడైన విరాట్ కెప్టెన్‌గా జట్టుకు అద్భుత విజయాలను అందించాడు’’ అని సల్మాన్ భట్ చెప్పాడు.

విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని రోహిత్ శర్మ అందుకున్న విషయం తెలిసిందే. గత పదేళ్లుగా ఐసీసీ కప్‌ను గెలవలేకపోయిన భారత్‌కు రోహిత్ అందిస్తాడేమోనని ఆశలు అభిమానుల్లో కలిగాయి. గతేడాది జరిగిన ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో నిరాశపరిచాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ భారత్‌ ఓడిపోయింది. మరోవైపు వ్యక్తిగతంగానూ రోహిత్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఈ ఏడాదే మళ్లీ ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి టోర్నీలు జరగబోతున్నాయి. ఈసారైనా ఐసీసీ కప్‌ లోటును తీరుస్తాడేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని