IPL 2024: సామ్‌ కరన్‌కు 50 శాతం.. డుప్లెసిస్‌కు రూ. 12 లక్షల ఫైన్

ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో.. ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Updated : 22 Apr 2024 12:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్‌ కరన్‌కు (Sam Curran) ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో అతడికి ఫైన్ పడింది. ఈ విషయాన్ని ఐపీఎల్ కమిటీ ప్రకటించింది. ‘‘ఐపీఎల్‌ కోడ్ ఆఫ్‌ కండక్ట్ ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పిదాన్ని మ్యాచ్‌ రిఫరీ ఎదుట అంగీకరించాడు. దీంతో అతడికి మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం ఫైన్‌గా విధించాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మేం 15 పరుగులు వెనుకబడ్డాం: కరన్

‘‘స్వల్ప స్కోరును కాపాడేందుకు మా బౌలర్లు చాలా శ్రమించారు. తొలుత బ్యాటింగ్‌లో కనీసం మరో 15 పరుగులు చేసినా బాగుండేది. మాకే విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. రషీద్, నూర్ అహ్మద్‌తోపాటు సాయి కిశోర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ పిచ్‌పై 160 పరుగులు చేసినా గెలవొచ్చు. ప్రభ్‌సిమ్రన్ బాగా ఆడాడు. పవర్‌ ప్లే తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లు చేజార్చుకోవడం దెబ్బ కొట్టింది. ఇక నుంచి మేం ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలి’’ అని కరన్ తెలిపాడు. 

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా డుప్లెసిస్‌కు.. 

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు (Faf Duplessis) జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షలు ఫైన్‌ను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ  ప్రకటన జారీ చేసింది. ‘‘లీగ్‌లో 36వ మ్యాచ్‌ కోల్‌కతా-బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఆదివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌కు జరిమానా విధిస్తున్నాం. మళ్లీ ఇలాంటి తప్పిదం పునరావృతమైతే రెట్టింపు ఫైన్‌ విధించాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని