Ravindra Jadeja - Sanjay Manjrekar: అక్కడ జడేజా బ్యాటింగ్‌.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్

గతంలో రవీంద్ర జడేజా ఇచ్చిన కౌంటర్ గుర్తుకొచ్చిందేమో.. సంజయ్ మంజ్రేకర్ ఆచితూచి మాట్లాడాడు. ఇదంతా బంగ్లాతో టీమ్‌ఇండియా వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకుంది.

Updated : 02 Jun 2024 17:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2204) తొలి పోరుకు ముందు భారత్ వార్మప్‌ మ్యాచ్‌లో ఆడింది. బంగ్లాను 60 పరుగుల తేడాతో చిత్తు చేసి విజయం సాధించింది. సంజూ శాంసన్‌ తప్ప మిగతా బ్యాటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాక.. 17వ ఓవర్‌ చివరి బంతికి రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. తన్విర్ ఇస్లామ్‌ వేసిన తొలి బంతికే స్టంపౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లిటన్ దాస్‌ వికెట్లను గిరాటేసినప్పటికీ.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్ కింద జడేజాను అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. 

ఆ సమయంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ కామెంట్రీ చేస్తున్నాడు. తొలుత జడేజాను ఔట్‌గా భావించిన మంజ్రేకర్ అదే మాటను వెల్లడించాడు. తప్పకుండా బంగ్లాదేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పాడు. తీరా జడేజా నాటౌట్‌గా నిలవడంతో.. ‘‘లైన్‌కు లోపల అతడి పాదం లేనట్లుంది. వద్దులే అక్కడ జడేజా బ్యాటింగ్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను నోరు మూసుకుని ఉండటమే బెటర్’ అంటూ తన కామెంట్రీని ఆపేశాడు. దీంతో పక్కనే ఉన్న మిగతా కామెంటేటర్లు నవ్వేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

అప్పుడు ఏం జరిగిందంటే?

2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ క్రికెటర్లు తనకు నచ్చరని సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలకు జడేజా కూడా దీటుగా బదులిచ్చాడు. ‘‘మీ(మంజ్రేకర్‌ను ఉద్దేశిస్తూ) కెరీర్‌లో ఆడిన మ్యాచ్‌ల కంటే రెట్టింపు మ్యాచ్‌లు ఆడాను. ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. ఎదుటి వ్యక్తులను గౌరవించడం నేర్చుకోండి. మీ నోటిదురుసు గురించి నేను చాలా విన్నాను’’ అని నాడు జడేజా సోషల్‌మీడియా వేదికగా మంజ్రేకర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా ఆటను పలు సందర్భాల్లో మంజ్రేకర్‌ అభినందిస్తూ పోస్టులు కూడా పెట్టడం గమనార్హం.

దాయాదితో పోరు కోసం వెయిటింగ్‌: రైనా

మెగా టోర్నీలో జూన్ 9న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో దాయాది దేశంతో మ్యాచ్‌ కావడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా భావోద్వేగానికి గురయ్యాడు. తప్పకుండా భారత్‌ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. 2007 విన్నింగ్‌ టీమ్‌లో రైనా కూడా ఒకడు. ‘‘మన జట్టు చాలా బాగుంది. న్యూయార్క్‌ వేదికగా పాక్‌తో తలపడబోతున్నాం. రోహిత్ నాయకత్వంలో విజయం సాధిస్తాం. ప్రతి విభాగంలో మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. గతంలో మేం ఆడిన రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి. యువీ, ఆర్పీతో కలిసి పాకిస్థాన్‌పై ఆడాం. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణమే. ఇప్పుడు ఆటకు మాత్రమే వీడ్కోలు పలికాం. జాతీయ పతాకం చూసినప్పుడల్లా మనసు ఉప్పొంగిపోతుంది’’ అని రైనా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని