KL Rahul - Sanjiv Goenka: మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్‌ స్వీట్‌ రిప్లయ్‌!

లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ మళ్లీ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాడు. గౌతమ్‌ గంభీర్‌ చేసిన పోస్టూ వైరల్‌గా మారింది. 

Published : 15 May 2024 19:01 IST

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌తో మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్‌తో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించారు. చీవాట్లు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో క్రికెట్ అభిమానులు హోరెత్తించారు. తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ లఖ్‌నవూ పరాజయం పాలైంది. దీంతో తమ ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం కూడా వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోలు వచ్చాయి. కానీ, అందులో ప్రశాంతంగా ఉంటూ కనిపించడం గమనార్హం. దీంతో మరోసారి నెటిజన్లు తమ కామెంట్లకు పదునుపెట్టారు. ఒక దశలో లఖ్‌నవూ ఆడే చివరి రెండు మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించడనే వార్తలూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ దిల్లీతో మ్యాచ్‌కు కేఎల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు మంచి క్యాచ్ పట్టినప్పుడు గోయెంకా అభినందించడం, కేఎల్ ఔటైనప్పుడు బాధపడటం వంటి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


అభిమాని విజ్ఞప్తికి గంభీర్‌ రిప్లయ్‌

కోల్‌కతాను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ స్ఫూర్తినింపడంలో ముందుంటాడు. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు డగౌట్‌లో కూర్చుని ఉండే గంభీర్ నవ్వడం చాలా అరుదు. ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాత్రం ప్లేయర్లను నవ్వుతూ పలకరిస్తాడు. రెండు రోజుల కిందట గుజరాత్‌ - కోల్‌కతా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఓ మహిళా అభిమాని.. ‘‘గౌతమ్‌ గంభీర్‌ నవ్వే వరకు నా క్రష్‌కు ప్రపోజ్‌ చేయను’’ అని ప్లకార్డు ప్రదర్శించింది. ఆ ఇమేజ్‌ వైరల్‌గా మారడంతో గంభీర్‌ స్పందించాడు. నవ్వుతున్న ఓ ఫొటోను షేర్‌ చేసిన అతడు.. ఇక నువ్వు ప్రొసీడ్‌ అవ్వొచ్చు అన్నట్లు పోస్టు పెట్టాడు. 


సారథిగా ప్రదర్శనపై పీటర్సన్ స్పందన

హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై వస్తున్న విమర్శలను గౌతమ్ గంభీర్ కొట్టి పడేశాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్‌, కెవిన్ పీటర్సెన్ బ్యాటింగ్ గణాంకాలను ప్రస్తావించాడు. సారథులుగా వారిద్దరేమీ గొప్ప ప్రదర్శనలు చేయలేదని వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందిస్తూ కెవిన్ పీటర్సెన్ ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. ‘‘అతడు చెప్పిందేమీ తప్పు కాదు. నేను భయంకరమైన సారథిని’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు