Sarfaraz Khan: ఎట్టకేలకు సర్ఫరాజ్‌ వచ్చేశాడు... సీనియర్ల కంటే స్పెషలేంటి?

ఎట్టకేలకు దేశవాళీ స్టార్‌ క్రికెటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌కు (Sarfaraz Khan) భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. సీనియర్లను కాదని.. బీసీసీఐ అతడివైపే మొగ్గు చూపింది. దీంతో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లూ పెడుతున్నారు.

Updated : 31 Jan 2024 12:12 IST

ఇంగ్లాండ్‌తో (IND vs ENG) రెండో టెస్టుకు ముందు ఇద్దరు సీనియర్‌ భారత ఆటగాళ్లు గాయపడ్డారు. ఆ ఇద్దరికి బదులు మళ్లీ సీనియర్లనే తీసుకుంటారని అంతా భావించారు. తీరా.. కేవలం నాలుగు టెస్టులే ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇంకా అడుగు పెట్టని మరో ఇద్దరికి అవకాశం దక్కింది. అందులో ఇప్పుడందరి దృష్టి సర్ఫరాజ్‌ ఖాన్‌పైనే (Sarfaraz Khan) పడింది. పుజారా, రహానె వంటి సీనియర్లను కాదని.. ఈ కుర్రాడివైపే బీసీసీఐ (BCCI) మొగ్గు చూపడానికి కారణాలున్నాయి.

దేశవాళీ క్రికెట్‌లో ఇద్దరు ఆటగాళ్ల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ‘బాగా ఆడుతున్నారు, జాతీయ జట్టులోకి సెలక్ట్‌ కాలేకపోతున్నారు’ అనేది వాటి సారాంశం. వారిలో ఒకరు పృథ్వీ షా కాగా.. మరొకరు సర్ఫరాజ్‌ ఖాన్‌. పృథ్వీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. కొన్ని మ్యాచుల్లో ఫర్వాలేదనిపించినా నిలకడలేమితో బయటకు వచ్చేశాడు. ఆ విషయం పక్కనపెడితే... ఆ రెండో బ్యాటర్‌ ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ విషయంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆనందంగా ఉన్నా... సీనియర్లు అందులోనూ దేశవాళీలో అదరగొడుతున్న ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెను కాదని కొత్త వాళ్లకు ఛాన్స్‌ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఇదీ సర్ఫరాజ్ ఖాన్‌ తొలిసారి స్పందన

ఫస్ట్‌క్లాస్‌లో సూపర్‌..

సీనియర్లను కాకుండా కొత్త వాళ్లకే టీమ్‌ ఇండియా పెద్ద పీట వేస్తోంది అని సమాధానం చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా జట్టు ఎంపికలో బీసీసీఐ ఇలానే ఆలోచిస్తోంది. అయితే ఆ సీనియర్లను కాదనేంత టాలెంట్‌ సర్ఫరాజ్‌ దగ్గర ఏముంది అనేది కూడా చర్చనీయాంశమే. రీసెంట్‌ ఫామ్‌ చూస్తే... సిరీస్‌ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీ (160 బంతుల్లో 161 పరుగులు) చేశాడు. 18 ఫోర్లు, 5 సిక్స్‌లతో వన్డే తరహాలో శతకం బాదేశాడు. ఆ ఆటకుగాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ కూడా దక్కింది. ఇక ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో చూస్తే... 45 మ్యాచుల్లో 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు (ఒక ట్రిపుల్‌ సెంచరీ), 11 హాఫ్‌ సెంచరీలూ ఉన్నాయి.

2022 రంజీ సీజన్‌లో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ జాతీయ జట్టుకు రావడం పక్కా అనే మాటలు వినిపించాయి. కానీ అవి ఊహాగానాల వరకే పరిమితమయ్యాయి. టెస్టు సిరీస్‌ కోసం జట్టును ప్రకటించే ప్రతి సందర్భంలో సర్ఫరాజ్‌ పేరు మీడియాలో చర్చకొస్తుంది కానీ సీనియర్ల వల్ల రేసులో వెనుకబడిపోయాడు అని అనేవారు. అయితే ఈసారి టెస్టు క్యాప్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. జట్టులో ఖాళీ అయిన రాహుల్‌ స్థానంలో ఆడాల్సిన బ్యాటర్‌కు కావాల్సిన లక్షణాలు అన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. భారీ ఇన్నింగ్స్‌లు, స్పిన్‌ ట్రాక్‌ల మీద నిలదొక్కుకోవడం లాంటివి ఇప్పటికే రంజీల్లో చేసి చూపించాడు. అయితే ఫైనల్‌ XIలో చోటు దక్కి... జోరు మీదున్న ఇంగ్లాండ్‌ను అడ్డుకుంటే మిగిలిన మూడు టెస్టుల్లో కొనసాగడం పెద్ద విషయం కాదు. 

సుందర్‌, సౌరభ్‌కు తుది జట్టులో కష్టమేనా?

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు స్క్వాడ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. ఇప్పటికే స్పిన్‌ కోటాలో జడ్డూ లేకపోయినా.. కుల్‌దీప్‌ యాదవ్‌ సిద్ధంగా ఉన్నాడు. సుందర్, సౌరభ్‌ ఇద్దరూ బ్యాటింగ్‌తోపాటు స్పిన్‌ బౌలింగ్‌ చేయగల సమర్థులే. కానీ, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ జాబితాలో కుల్‌దీప్‌ ముందుంటాడు. సౌరభ్ కుమార్‌ ఇంగ్లాండ్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. మొత్తం 68 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 290 వికెట్లు తీసిన సౌరభ్‌.. బ్యాటింగ్‌లోనూ 2వేలకుపైగా పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్‌ ఇప్పటికే భారత్‌ తరఫున 5 టెస్టులు ఆడాడు. 2021లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. అప్పుడు నాలుగు టెస్టుల్లో ఆరు వికెట్లే తీశాడు. తాజాగా ఇంగ్లాండ్‌ లయన్స్‌పై బ్యాటింగ్‌లో 57 పరుగులు చేసిన సుందర్‌ రెండు కీలక వికెట్లూ పడగొట్టాడు.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని