Sarfaraz Khan: తనయుడికి క్యాప్‌.. తండ్రి కన్నీళ్లు.. ఎట్టకేలకు సర్ఫరాజ్‌ సాధించాడు

స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే నుంచి ఓ ఆటగాడు టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. అది చూసి అక్కడే కాస్త దూరంగా ఉన్న అతని తండ్రి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు.

Updated : 15 Feb 2024 14:24 IST

నేటి ఉదయం..రాజ్‌కోట్‌ క్రికెట్‌ స్టేడియం.. సమయం ఇంచుమించుగా 8:45 గంటలు. భారత్, ఇంగ్లాండ్‌ జట్లు కీలకమైన మూడో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. అభిమానులు ఆట కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మైదానంలో భారత ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది చుట్టూ నిలబడగా.. మధ్యలో స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే నుంచి ఓ ఆటగాడు టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. అది చూసి అక్కడే కాస్త దూరంగా ఉన్న అతని తండ్రి భావోద్వేగాలను నియంత్రించుకోలేక.. ఉబికి వస్తున్న కన్నీళ్లను కట్టడి చేయలేక ఏడుస్తున్నాడు. తనయుడి చేతుల్లో నుంచి ఆ క్యాప్‌ తీసుకుని ముద్దులు పెట్టాడు. కొడుకును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తండ్రి కన్నీళ్ల వెనుక ఎంతో కష్టం ఉంది. వెలకట్టలేని త్యాగం ఉంది. సంవత్సరాల నిరీక్షణ ఉంది. ఆ తండ్రి పేరు నౌషద్‌ ఖాన్‌. తాజాగా టెస్టు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) అతని కొడుకే. 

ఇప్పుడొచ్చాడు

దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు.. ప్రతి సీజన్‌లోనూ నిలకడైన ప్రదర్శన. భారత- ఎ జట్టు తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి సర్ఫరాజ్‌ సత్తాచాటాడు. ఇప్పటివరకూ 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3912 పరుగులు సాధించాడు. అతని సగటు 69.85గా ఉండటం విశేషం. 14 శతకాలూ చేశాడు. అతని అత్యధిక స్కోరు 301 నాటౌట్‌. ప్రతిభపరంగా, నైపుణ్యాల పరంగా, ఆట పరంగా సర్ఫరాజ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. కానీ భారత జట్టులో తీవ్రమైన పోటీ కారణంగా ఇన్ని రోజులూ చోటు దక్కలేదు. అవకాశం కోసం ఎదురు చూసినా వరుసగా నిరాశే ఎదురవడంతో సర్ఫరాజ్‌ బాధపడ్డాడు. కానీ పరుగుల వేట ఆపలేదు. జట్టుకు ఎంపికలో అతణ్ని పరిగణించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ ఆటతోనే తన సత్తా ఏంటో చాటాడు. ముంబయి తరపున అత్యుత్తమ ప్రదర్శనతో సాగిపోయాడు. దేనికైనా సమయం రావాలంటారు. ఇప్పుడు సర్ఫరాజ్‌కు టైమ్‌ వచ్చింది. ఇన్ని రోజుల నిరీక్షణ ముగిసింది. టీమ్‌ఇండియాకు ఆడాలనే ఈ 26 ఏళ్ల ఆటగాడి కల నిజమైంది. అయితే సర్ఫరాజ్‌ ప్రయాణంలో అడుగడుగునా అతనికి అండగా నిలిచాడు తండ్రి నౌషద్‌. 

ఛాంపియన్‌గా తీర్చిదిద్ది

సర్ఫరాజ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దింది ఇంకెవరో కాదు తండ్రి నౌషదే. క్రికెట్‌ అంటే పిచ్చి ప్రేమ ఉన్న నౌషద్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తన తనయుడు సర్ఫరాజ్‌ ప్రతిభను అతను గుర్తించాడు. క్రికెట్లో ఓనమాల దగ్గర నుంచి అన్ని అంశాలనూ నేర్పాడు. ఇంటి పక్కనే పిచ్‌ రూపొందించుకుని సర్ఫరాజ్‌తో పాటు చిన్న తనయుడు ముషీర్‌ ఖాన్‌కూ క్రికెట్‌ పాఠాలు నేర్పాడు. బాల్యం నుంచి సర్ఫరాజ్‌ వెంటే నీడలా ఉండి, కష్ట సమయాల్లోనూ అండగా తండ్రి నిలబడ్డాడు. రంజీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా భారత టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతో మరింతో కసితో కష్టపడ్డాడు. సర్ఫరాజ్‌ను ఎప్పటికప్పుడూ మోటివేట్‌ చేస్తూ సాగాడు. ఇన్నాళ్లకు ఆ తండ్రి కల నిజమైంది. ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కే సమయంలో తనయుడి పక్కనే ఉండాలని రాజ్‌కోట్‌ మైదానానికి నౌషద్‌ వచ్చాడు. సర్ఫరాజ్‌ టీమ్‌ఇండియా టెస్టు టోపీ అందుకునే క్షణాలను దగ్గరి నుంచి చూడటంతో అతనికి కన్నీళ్లు ఆగలేదు. దేనికోసమైతే కష్టపడ్డాడో ఆ స్వప్నం సాకారం కావడంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తండ్రి కన్నీళ్లను తుడిచిన సర్ఫరాజ్‌.. గట్టిగా హత్తుకున్నాడు. ఈ తండ్రికొడుకుల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటో ఆఫ్‌ ది డే అంటూ నెటిజన్లు వీటిని షేర్‌ చేస్తున్నారు. 

- ఈనాడు క్రీడా విభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని