Satwik-Chirag: ఛాంప్స్‌ సాత్విక్‌-చిరాగ్‌

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి అదరగొట్టారు.

Published : 20 May 2024 02:06 IST

భారత జోడీకి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌

బ్యాంకాక్‌: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి అదరగొట్టారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఈ జంట 21-15, 21-15తో చెన్‌ యాంగ్‌- ల్యూ యి (చైనా) జంటపై విజయం సాధించింది. వరుస గేమ్‌లలో ప్రత్యర్థిని చిత్తుచేసిన భారత జోడీ పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టోర్నీల్లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి ఇది తొమ్మిదో టైటిల్‌ కాగా.. 2024లో రెండోది. ఈ ఏడాది మార్చిలో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ సాధించింది. మలేసియా సూపర్‌ 1000, ఇండియా సూపర్‌ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ తుది పోరులో సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి ఎదురులేకుండా పోయింది. 5-1తో మొదటి గేమ్‌ను ప్రారంభించిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 14-11తో ముందంజ వేసింది. ప్రత్యర్థి జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదురవడంతో భారత ద్వయం ఆధిక్యం 16-14కు తగ్గింది. అయితే ఒక్కసారిగా గేరు మార్చిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ వరుస పాయింట్లతో హోరెత్తించి 21-15తో తొలి గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌ కూడా మొదటి గేమ్‌కు నకలులా సాగింది. సాత్విక్‌- చిరాగ్‌ ధ్వయం ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించింది. 15-11తో ఆధిక్యంలో నిలిచింది. ఆ సమయంలో పుంజుకున్న చైనా జంట 14-15, 15-16తో భారత జోడీని సమీపించింది. అయితే మరోసారి జూలు విదిల్చిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ప్రత్యర్థి ఇంకో అవకాశం ఇవ్వకుండా 21-15తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత జోడీ మరోసారి టైటిల్‌ను దక్కించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని