IND vs PAK: షోయబ్‌ అక్తర్‌తో యుద్ధానికి సిద్ధం: వీరేంద్ర సెహ్వాగ్‌

వన్డే ప్రపంచ కప్‌ 2023 మెగా టోర్నీలో (ODI World Cup 2023) దాయాదుల పోరుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇరు దేశాల అభిమానులు ఎంత ఆత్రుతగా ఉన్నారో.. మాజీ క్రికెటర్లు సైతం ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 28 Jun 2023 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో (Shoaib Akhtar) భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) యుద్ధానికి సిద్ధమేంటని కంగారు పడొద్దు. వీరిద్దరూ ప్రస్తుతం క్రికెట్‌ ఆడటం లేదు కదా.. మరెక్కడ తలపడతారనేగా మీ సందేహం. ఇది మైదానంలో కాదులెండి.. సోషల్‌ మీడియా సంగ్రామం. సామాజిక మాధ్యమాలు వచ్చాక మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఇదే మాట సెహ్వాగ్‌ స్వయంగా ప్రకటించాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ (ODI World Cup 2023) షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. అక్టోబర్‌ 15న భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలోనే సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ప్రపంచకప్ అనగానే ప్రతి ఒక్కరి దృష్టి భారత్ - పాక్‌ మ్యాచ్‌పైనే ఉంటుంది. నేను కూడా సిద్ధమవుతున్నా. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో సోషల్ మీడియా వేదికగా తలపడేందుకు సిద్ధం. వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు భారత్‌కు ఓటమి లేదు. ప్రస్తుతం 7-0 ఆధిక్యంలో ఉన్నాం. ఒక్కసారి ఛేజింగ్‌ చేసి విజయం సాధించగా.. మిగిలిన మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి గెలిచింది. అక్టోబర్‌ 15న ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. ఒత్తిడిని అధిగమించిన జట్టు తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. 

మరోసారి గుర్తు చేసిన ఐసీసీ

వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ పాల్గొనడంపై అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. బేషరతుగా ఆడతామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అంగీకారం తెలిపేలా అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్లు ఐసీసీ గుర్తు చేసింది. ‘‘ప్రతి జట్టు వారి దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలి. వాటిని మేం కూడా గౌరవిస్తాం. అయితే, పాక్‌ ఆడుతుందనే నమ్మకం మాకుంది. ఇప్పటికే పీసీబీ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది’’ అని ఐసీసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని