Virender Sehwag: రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్‌

టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. 

Published : 25 Apr 2024 16:28 IST

ఇంటర్నెట్ డెస్క్: పదునైన మాటలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాజీ క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) ఒకరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా తనదైన శైలిలో స్పందించడం సెహ్వాగ్‌కు అలవాటు. తాజాగా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో సాగిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రముఖ ఇంగ్లిష్‌ బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్‌ నుంచి వచ్చిన ఆఫర్‌పైనా, బిగ్‌బాష్‌ లీగ్‌లో భారత క్రికెటర్లు ఆడకపోవడానికి   గల కారణాలపైనా మాట్లాడాడు. 

‘‘నాకు ఒకసారి స్కై స్పోర్ట్స్‌ నుంచి కాల్ వచ్చింది. వారి ప్యానెల్‌లో ఉండాలని కోరింది. అయితే, మీరు నన్ను భరించలేరు అని చెప్పా. ‘అలా కాదు. మీ ధర ఎంతో చెప్పండి’ అని సంస్థ అడిగింది. అయితే, నాకు రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని అడిగా. దానికి ‘అవును మీరు చెప్పింది నిజమే. మేం తట్టుకోలేం’ అని సమాధానం వచ్చింది’’ అని సెహ్వాగ్ తెలిపాడు. 

బిగ్‌బాష్‌ గురించి..

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో భారత క్రికెటర్లు ఎవరూ ఆడకపోవడానికి కారణాలు ఏంటి? అని గిల్‌క్రిస్ట్‌ ప్రశ్నించాడు. భారత క్రికెటర్లకు వేరే దేశాల్లో ఆడాల్సిన అవసరం లేదని.. వారి దగ్గర చాలా సంపద ఉందని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. ఈసందర్భంగా బిగ్‌బాష్‌కు చెందిన ఓ ఫ్రాంచైజీ నుంచి కూడా ఓ భారీ ఆఫర్‌ వచ్చిందని దానిని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. 

‘‘మాకు డబ్బులు అవసరం లేదు. మేం రిచ్. ఇతర లీగ్‌ల కోసం పేద దేశాలకు వెళ్లం (నవ్వుతూ). నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. భారత జట్టు నుంచి నన్ను తప్పించారు. ఐపీఎల్‌లో ఆడుతున్నా. ఆ సమయంలో బిగ్‌బాష్‌ లీగ్ నుంచి ఆఫర్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తే లక్ష ఆస్ట్రేలియా డాలర్లను ఇవ్వడానికి సిద్ధమని బీబీఎల్‌ నుంచి సమాధానం వచ్చింది. అంత సొమ్మును కేవలం నా హాలీడేస్‌ కోసమే వెచ్చిస్తా. గత రాత్రి (అప్పుడు) బిల్ కూడా లక్ష డాలర్ల కంటే ఎక్కువే అయింది’’ అని సెహ్వాగ్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని