Shahid Afridi: కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్‌ అఫ్రిది

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు.

Published : 27 Mar 2024 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్: గత వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత తమ జట్టు కెప్టెన్సీలో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు మార్పులు చేసింది. బాబర్‌ అజామ్‌ను తొలగించి టీ20 జట్టు సారథిగా షహీన్‌ అఫ్రిదిని నియమించింది. టెస్టు జట్టు బాధ్యతలను షాన్ మసూద్‌కు అప్పగించింది. వన్డే టీమ్‌కు ఎవరినీ ఎంపిక చేయలేదు. అయితే, ఇప్పుడు షహీన్‌ను సారథ్యం నుంచి తొలగించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలో పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తన అల్లుడిని వెనకేసుకొచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు తీరును ఆక్షేపిస్తూ విమర్శలు గుప్పించాడు. ఎవరినైనా ఎంపిక చేసినప్పుడు తగినంత సమయం ఇవ్వాలని హితవు పలికాడు. 

‘‘మీరు (బోర్డును ఉద్దేశించి) ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు వారు కుదురుకోవడానికి సమయం కూడా ఇవ్వాలి. కానీ, పాక్‌ క్రికెట్‌లో అతి పెద్ద సమస్య ఏంటంటే.. బోర్డులోని పెద్దలు మారినప్పుడుల్లా పద్ధతి మారిపోతుంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా దేశ క్రికెట్‌కు మంచి కోసం ఆలోచనలు చేయాలి. మీరు గతంలో కెప్టెన్‌ను మార్చాలని భావించారు. అందుకోసం షహీన్‌ను సారథిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ అతడిని మార్చాలని భావిస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ ఉంది? అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం పొరపాటా? ఇప్పుడు ఇలాంటి సమయంలో మార్చాలనుకోవడం తప్పా? మీరే తేల్చుకోవాలి. 

పాక్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా విదేశీ ఆటగాడి నియామకంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అతడి ట్రాక్‌ రికార్డు మాత్రం బాగుండాలి. అప్పుడే మన ఆటగాళ్లందరూ అతడితో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. సీనియర్‌ క్రికెటర్లు ఇమాద్ వాసిమ్‌, మహమ్మద్ అమిర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే, వారిద్దరూ తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. కాకుల్‌లో జరిగే రెండు వారాల ట్రైనింగ్‌ క్యాంప్‌లో రాటుదేలితే మాత్రం వారిద్దరూ సూపర్‌ మ్యాన్‌లు అవుతారు. ప్రస్తుతం ఉన్న టీ20 కెప్టెన్సీ ఫర్వాలేదు. తప్పకుండా అతడి సత్తాను నిరూపించుకొనేందుకు గడువు ఇవ్వాల్సిందే’’ అని షాహిద్‌ వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్‌ నుంచి టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కెప్టెన్సీ మార్పు చేస్తే జట్టు ప్రదర్శనపైనా ప్రభావం పడే అవకాశం ఉందనేది కొందరు మాజీల వాదన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని