Lucknow Vs Punjab: పంజాబ్‌ మ్యాచ్‌లోనైనా షామార్‌ను చూస్తామా? లఖ్‌నవూ కోచ్‌ ఏమన్నాడంటే?

గబ్బా టెస్టులో ఆసీస్‌ను బెంబేలెత్తించిన పేసర్ షామార్‌ జోసెఫ్. ఐపీఎల్‌లో లఖ్‌నవూ జట్టు తీసుకుంది. అతడి బౌలింగ్‌ను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Published : 30 Mar 2024 14:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాపై సంచలన స్పెల్‌తో క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచిన బౌలర్ షామార్ జోసెఫ్‌ (Shamar Joseph). విండీస్‌కు చెందిన అతడిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లఖ్‌నవూ తీసుకుంది. మార్క్‌వుడ్ గాయపడటంతో అతడి స్థానంలో ఎంపిక చేసుకుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అతడిని ఆడించలేదు. అప్పుడు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ స్పందిస్తూ.. షామార్‌ను బరిలోకి దింపేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపాడు. ఇవాళ పంజాబ్‌తో లఖ్‌నవూ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా అతడి బౌలింగ్‌ను చూసే అవకాశం ఉంటుందా? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.  దానికి లఖ్‌నవూ కోచ్‌ జస్టిన్‌ లాంగర్ చేసిన వ్యాఖ్యలే కారణం. 

‘‘షామార్‌ జోసెఫ్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ఆటగాడు. అతడి క్రీడాస్ఫూర్తి, పోరాటంపై నాకు గౌరవం ఉంది. అతడు ఇంకా కుర్రాడే. జట్టులో స్థానం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. అయితే, పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను. మేం మాత్రం నలుగురు విదేశీ ప్లేయర్లలో ముగ్గురు బ్యాటర్లు, ఒకరు బౌలర్‌ ఉండేలా ప్రణాళికతో బరిలోకి దిగుతాం. నవీనుల్‌ హక్‌ తొలి మ్యాచ్‌లో బాగానే బౌలింగ్‌ చేశాడు. పంజాబ్‌ పైనా నాణ్యమైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నాం. బ్యాటర్లలో క్వింటన్ డికాక్‌, నికోలస్‌ పూరన్, మార్కస్‌ స్టాయినిస్‌ ఉంటారు. అయితే, మ్యాచ్‌ ముందు వరకు నిర్ణయంలో మార్పులు ఉండొచ్చు’’ అని జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని డేవిడ్‌ విల్లే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీని లఖ్‌నవూ తీసుకుంది.

హర్షల్‌ రాణిస్తాడు: సునీల్ జోషి

హర్షల్‌ పటేల్ రెండు మ్యాచుల్లో 11.50 ఎకానమీతో 3 వికెట్లను మాత్రమే తీశాడు. మినీ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న అతడు తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. దీనిపై పంజాబ్‌ కోచ్‌ సునీల్ జోషి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభంలోనే ఉన్నాం. మేం ఇప్పటికి రెండు మ్యాచులే ఆడాం. ఒక బౌలర్‌ రాణించనంత మాత్రాన అతడిపై ముద్ర వేసేయడం తగదు. తన బౌలింగ్‌పై ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్నాడు. మున్ముందు మ్యాచుల్లో సత్తా చాటుతాడనే నమ్మకం మాకుంది. డెత్ ఓవర్లలో వికెట్ల కోసం వెళ్లినప్పుడు పరుగులు ఇవ్వడం సహజమే’’ అని సునీల్ జోషి వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని