Shami: ఆ వికెట్‌ మరింత నమ్మకాన్ని ఇచ్చింది: షమీ

కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై షమీ (Shami) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.

Updated : 23 Oct 2023 09:07 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023) టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మొదటి బంతికి వికెట్‌ తీసిన మహమ్మద్‌ షమీ (Shami) ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. న్యూజిలాండ్‌పై (IND vs NZ) ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/54) సంచలన స్పెల్‌ నమోదు చేశాడు. దీంతో కివీస్‌ ఒకానొక దశలో 300కిపైగా పరుగులు చేసేలా కనిపించినా.. షమీ కట్టడి చేయడంతో 273 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌ అనంతరం తన బౌలింగ్‌ ప్రదర్శనపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘తొలి బంతికే వికెట్ తీసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. జట్టులోని సహచరులు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పుడు తప్పకుండా మనం మద్దతుగా నిలవాలి. జట్టుగా సమష్ఠిగా రాణిస్తే విజయం సాధించడం కష్టమేం కాదు. ఆ సమయంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. మన జట్టు టాప్‌లో ఉండాలని కోరుకోవాలి. ఐదు వికెట్లు తీయడంతోపాటు భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అని షమీ తెలిపాడు. విల్‌ యంగ్‌ను (17) తాను వేసిన తొలి బంతికే షమీ బౌల్డ్ చేశాడు. విల్ బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో పెవిలియన్‌కు చేరాడు. వరల్డ్‌కప్‌ల్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 36 వికెట్లు పడగొట్టాడు. దీంతో అనిల్‌ కుంబ్లే (31)ను అధిగమించాడు. మరో 9 వికెట్లు తీస్తే షమీనే టాప్‌ భారత బౌలర్‌ అవుతాడు. అతడి కంటే జహీర్‌ ఖాన్ (44), జవగళ్ శ్రీనాథ్ (44) ముందున్నారు.

వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన భారత్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 10 పాయింట్లతో టాప్‌లో ఉండగా... న్యూజిలాండ్‌ నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికా (3 విజయాలు, ఒక ఓటమి) 6 పాయింట్లు, ఆస్ట్రేలియా (రెండు విజయాలు, రెండు ఓటములు) 4 పాయింట్లతో కొనసాగుతోంది. వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) టీమ్‌ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో లఖ్‌నవూ వేదికగా తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని