Shami: గాయం నుంచి కోలుకోని షమి.. జట్టులోకి వచ్చేది ఎప్పటికో!

నాలుగు నెలల కిందట గాయపడిన షమీ (Shami) ఇంకా కోలుకోలేదు. అతడు ఎప్పుడు ఫిట్‌నెస్‌ సాధిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated : 28 Feb 2024 10:28 IST

వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమి అద్భుత ప్రదర్శనతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ కప్‌ ముగిసిన తర్వాత చాలారోజులు మైదానంలో కనబడలేదు. గాయపడిన మిగిలిన క్రికెటర్లంతా ఒక్కొక్కరుగా పునరాగమనం చేస్తుంటే షమి పునరాగమనం మరింత వెనక్కిపోతోంది. తాజాగా ఐపీఎల్‌లో కూడా ఆడటం లేదు. గాయం ఇంకా తగ్గకపోవడమే ఇందుకు కారణం. ఎప్పుడు కోలుకొని వస్తాడనేది అనుమానంగా ఉంది.. 

అసలేం జరిగింది..

ప్రపంచకప్‌లో షమికి చీలమండకు గాయమైంది. గాయం వేధిస్తుండగానే అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడినట్లు తెలిసింది. దీంతో దీని తీవ్రత ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత చికిత్స తీసుకోవడానికి ఈ పేసర్‌ లండన్‌ వెళ్లాడు. అక్కడే మూడు వారాలు ట్రీట్‌మెంట్‌ చేయించుకుని తిరిగి వచ్చేసి మళ్లీ సాధన మొదలుపెట్టాలని భావించాడు. అయితే నొప్పిని తగ్గించే ప్రక్రియలో భాగంగా షమికి చేసిన ఇంజెక్షన్లు సరిగా పని చేయలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. సాధన సంగతి పక్కనపెట్టి ముందు గాయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాడు. లండన్‌లోనే చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. మార్చి 22న ఆరంభమయ్యే ఐపీఎల్‌-17కి ఈ బౌలర్‌ దూరమవుతున్నట్లు అధికారికంగా ప్రకటనా వెలువడింది. ఈ పరిణామం గుజరాత్‌ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బే. గతేడాది 17 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్న షమి.. గుజరాత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే హార్దిక్‌ పాండ్య ముంబయికి వెళ్లిపోవడంతో ఢీలా పడ్డ గుజరాత్‌కు షమి కూడా లేకపోవడం ఇంకా కష్టమే. 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనైనా..

ప్రపంచకప్‌ తర్వాత దక్షిణాఫ్రికాతో కీలక పర్యటనలో  షమి కచ్చితంగా ఉంటాడనుకుంటే ఆ ఆశ తీరలేదు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో పెద్ద సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. ప్రపంచకప్‌ సందర్భంగా అయిన గాయం చిన్నదే ఇంజెక్షన్ల ద్వారా తగ్గిపోతుందని భావించిన అతడు ఎక్కువ దానిపై దృష్టిపెట్టనట్లు సమాచారం. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లోనైనా అతడు ఆడితే భారత్‌కు అదే పదివేలు. దానికంటే ముందు అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో, నవంబర్‌లో న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ఈ పేసర్‌ అందుబాటులో ఉండాలని జట్టు కోరుకుంటోంది. కానీ శస్త్ర చికిత్స తర్వాత.. కోలుకునే సమయాన్ని బట్టి షమి రాక ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లలో ఆడకపోతే నవంబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ కోసమైనా షమి వస్తాడా అనేది చూడాలి. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్‌లలో భారత్‌ చరిత్రాత్మక విజయాలు సాధించింది. ఈసారీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో సీనియర్లు దూరం కావడంతో భారత బౌలింగ్‌ దాడిలో పదును లోపించింది. స్పిన్‌ పిచ్‌లు కాబట్టి ఒకే పేసర్‌తో మేనేజ్‌ చేస్తూ టీమ్‌ఇండియా బండి లాగించింది. కానీ ఆస్ట్రేలియా లాంటి ప్రధాన సిరీస్‌లలో షమి లాంటి పేసర్‌ సేవలు అత్యవరం. టీమ్‌ఇండియా ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ సరిగా లేకపోవడంతో షమితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తరచూ గాయాల కారణంగా జట్టుకు దూరమమవుతున్నాడు. రంజీల్లో ఆడి ఫిట్‌నెస్, సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నా.. యువ ఆటగాళ్లు పెడ చెవినపెడుతున్నారు. ఇలాంటి విషయాలను బోర్డు సీరియస్‌గా తీసుకోకపోతే కీలక సిరీస్‌లకు ఇలా ప్రధాన ఆటగాళ్లు దూరం అవుతూనే ఉంటారు.

  -ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని