Shreyas Iyer: చెపాక్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాం : శ్రేయస్‌ అయ్యర్

ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకొని ముందుకుసాగుతామని కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) వ్యాఖ్యానించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ఓడింది.

Published : 09 Apr 2024 14:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతాకు తొలి ఓటమి ఎదురైంది. చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. తొలి బంతికే వికెట్‌ను కోల్పోయిన కోల్‌కతా పవర్‌ప్లేలో మాత్రం 56 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత మాత్రం స్వల్ప వ్యవధుల్లో వికెట్లను కోల్పోయి ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని.. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే భారీ స్కోరు చేసే అవకాశం చేజారిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) వ్యాఖ్యానించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. కనీసం మరో 30 పరుగులు చేసినా ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని పేర్కొన్నాడు. 

‘‘పవర్‌ప్లేలో మంచి స్కోరు చేశాం. ఆ ఊపును కొనసాగించడంలో విఫలం కావడం నిరాశపరిచింది. మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ను అంచనా వేయడంలో ఇబ్బందిపడ్డాం. వికెట్లను చేజార్చుకోవడంతో ప్రత్యర్థిపై భారీగా లక్ష్యం నిర్దేశించలేకపోయాం. త్వరగా పిచ్‌ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళికలను మార్చలేదు. ఇక్కడ పరుగులు చేయడం చాలా కష్టమని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. చెన్నైకి పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసు. వారి ప్రణాళికలు కూడా పక్కాగా అమలుచేయగలిగారు. హార్డ్‌ హిట్టర్లకూ భారీ షాట్లు కొట్టడం తేలికేం కాదు. ఇన్నింగ్స్‌ నిర్మాణంపై దృష్టిపెట్టలేకపోయాం. తప్పకుండా ఓటమి నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయాం. తదుపరి మ్యాచుల్లో దృఢంగా బరిలోకి దిగుతాం’’ అని శ్రేయస్ తెలిపాడు. 

కనీసం 160 పరుగులు చేసుంటే..: వరుణ్‌ చక్రవర్తి

‘‘మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూస్తే చాలా ఫ్లాట్‌గా అనిపించింది. పరుగులు ఈజీగా రాబట్టొచ్చని భావించా. కానీ, మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ తీరు పూర్తిగా మారిపోయింది. మేం ఇంకాస్త ఉత్తమంగా అంచనా వేస్తే బాగుండేది. పిచ్‌ చాలా నెమ్మదించింది. బంతిని కనెక్ట్ చేయడం చాలా కష్టం. కనీసం 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ను గెలిచే అవకాశం ఉండేది. మంచు ప్రభావం కూడా మా బౌలింగ్‌పై ప్రభావం చూపింది. శివమ్ దూబెకు ఓవర్‌ వేస్తుంటే బంతిపై నియంత్రణ కూడా సాధ్యం కాలేదు. ప్రతీ బ్యాటర్‌కు ఒక్కో ప్రణాళికతో బరిలోకి దిగుతాం. వాటిని సరిగ్గా అమలుచేయగలిగితే వికెట్‌ దక్కుతుంది. ప్రతీ జట్టులోని కొందరు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. వారికి కౌంటర్‌గా బంతులేయడంపై దృష్టిసారిస్తా’’ అని కోల్‌కతా బౌలర్‌ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని