Kolkata Vs Rajasthan: క్రీజ్‌లో బట్లర్.. చివరి ఓవర్‌ను వరుణ్‌కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రాజస్థాన్‌ను ఓడించాలని భావించిన కోల్‌కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు.

Updated : 17 Apr 2024 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 223/6 స్కోరు చేసింది. సునీల్ నరైన్ (109) సెంచరీ సాధించాడు. అనంతరం రాజస్థాన్‌ బ్యాటర్ జోస్ బట్లర్ (107*) చెలరేగడంతో సరిగ్గా 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులు అవసరమైన వేళ అనూహ్యంగా స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తికి కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ బంతినిచ్చాడు. మొదటి బాల్‌నే సిక్స్‌గా మలిచిన బట్లర్.. తర్వాత మూడు బంతులకు పరుగులు తీయలేదు. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. చివరి బంతికి సింగిల్ తీయడంతో రాజస్థాన్‌ విజయం సాధించింది. మొదటి బాల్‌కు సిక్స్‌ లభించకపోతే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం కోల్‌కతా అభిమానుల్లో ఉంది. ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్‌కు ఇవ్వడానికిగల కారణాలను మ్యాచ్ అనంతరం శ్రేయస్‌ వెల్లడించాడు. 

‘‘ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. ఓటమిని జీర్ణించుకోవడం కాస్త కష్టమే. రోవ్‌మన్‌ పావెల్ హిట్టింగ్‌ మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా చేసింది. అత్యుత్తమ బంతులను సంధిస్తేనే ఇలాంటి బ్యాటర్లను అడ్డుకోవచ్చు. ఏమాత్రం గతి తప్పినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకొని ముందుకు సాగుతాం. జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు పేస్‌ బౌలింగ్‌లో దూకుడుగా ఆడతాడు. అందుకే చివర్లో స్పిన్‌తో కట్టడి చేయాలని భావించాం. ఆ ప్రణాళికల్లో భాగంగానే వరుణ్‌ చక్రవర్తికి బౌలింగ్‌ ఇచ్చా. ఇక సునీల్ ఆట అద్భుతం. కోల్‌కతాకు అతడు బలం. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అభినందనీయం. మా జట్టులో అతడు ఉండటం గర్వంగా ఫీలవుతున్నా’’ అని శ్రేయస్ తెలిపాడు. 

ఆ సిక్స్‌లు.. బట్లర్ ఇన్నింగ్స్‌ హైలైట్‌: సంజూ శాంసన్

‘‘చివరి బంతికి విజయం సాధించడంతో మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినప్పుడు కాస్త ఆందోళనకు గురయ్యా. రోవ్‌మన్ పావెల్ భారీ సిక్స్‌లతో మమ్మల్ని రేసులోకి తీసుకొచ్చాడు. జోస్ బట్లర్ కీలక ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. గత ఆరేడు ఏళ్ల నుంచి అతడి ఆటతీరును చూస్తూనే ఉన్నా. క్లిష్టసమయాల్లో ఎలా ఆడాలో బట్లర్‌కు తెలుసు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి నాణ్యమైన స్పిన్నర్లు. వారిని ఎదుర్కొని పరుగులు చేయడం చాలా కష్టం. అయితే, జోస్ చివరి వరకూ క్రీజ్‌లో ఉంటే మాత్రం ఎంతటి స్కోరైనా ఛేదించడం సులువే’’ అని రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ వ్యాఖ్యానించాడు.

మ్యాచ్‌ విశేషాలు మరికొన్ని.. 

  • లక్ష్య ఛేదనలో ఆరో వికెట్‌ పడిన తర్వాత ఎక్కువ పరుగులు రాబట్టిన జట్టుగా రాజస్థాన్‌ నిలిచింది. కోల్‌కతాపై 103 రన్స్‌ను ఆ జట్టు బ్యాటర్లు చేశారు. 
  • టీ20ల్లో జట్టు విజయానికి కారణమైన సెంచరీలను ఎక్కువ చేసిన మూడో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. అతడు 8 శతకాలతో బాబర్ అజామ్‌తో సమానంగా కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ (16) అందరి కంటే ముందున్నాడు. 
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు నమోదైన ఆరో మ్యాచ్‌ ఇదే. కోల్‌కతా తరఫున సునీల్ నరైన్ (109).. రాజస్థాన్‌ బ్యాటర్ జోస్ బట్లర్ (107*) శతకాలు చేశారు.  
  • ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ జోస్ బట్లర్. అతడు ఇప్పటి వరకు 7 శతకాలు నమోదు చేశాడు. భారత స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ (8) ఈ రేసులో ముందున్నాడు. ఐపీఎల్‌లో లక్ష్య ఛేదన సందర్భంగా ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్‌ మాత్రం బట్లరే. అతడు మూడు సాధించగా.. కోహ్లీ 2, బెన్ స్టోక్స్ 2తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని