Kolkata vs Rajasthan: నరైన్‌ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసినందుకు కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు ఐపీఎల్‌ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.

Updated : 17 Apr 2024 18:36 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఏప్రిల్ 16న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ చివరి బంతికి విజయం సాధించింది. జోస్‌ బట్లర్ (107 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 6×6) చెలరేగడంతో రాజస్థాన్‌ 2 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. సునీల్‌ నరైన్‌ (Sunil Narine) (109; 56 బంతుల్లో 13×4, 6×6) విధ్వంసకర శతకంతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సంజు సేన 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ ఆఖరు బంతిని ఛేదించి ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ చేసిన శతకం వృథా అయినా అతడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో సెంచరీ బాదడంతోపాటు హ్యాట్రిక్‌ వికెట్ల ఘనత అందుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్‌ శర్మ, షేన్‌ వాట్సన్‌ మాత్రమే ఇదివరకు ఈ రికార్డు నెలకొల్పారు. ఈ విండీస్‌ మాంత్రికుడు 2013లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ హస్సీ, గుర్‌కీత్‌ సింగ్, అజామ్ మహమూద్‌ను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. 

రోహిత్ హ్యాట్రిక్ ఎప్పుడంటే?

ఐపీఎల్‌ ఆరంభంలో కొన్ని సీజన్ల పాటు రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. 2009లో ఆ జట్టు తరఫున ముంబయిపై హ్యాట్రిక్ సాధించాడు. అభిషేక్ నాయర్‌, హర్భజన్‌ సింగ్, జేపీ డుమినిలను పెవిలియన్‌కు పంపి ఈ ఫీట్ అందుకున్నాడు. కొన్నాళ్లకు ముంబయి జట్టుకు మారిన రోహిత్ శర్మ 2012లో కోల్‌కతాపై సెంచరీ చేశాడు. ఐపీఎల్ 17 సీజన్‌లో ఇటీవల చెన్నైపై అతడు మూడంకెల స్కోరు అందుకుని రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక షేన్‌ వాట్సన్ విషయానికి వస్తే అతడు చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్‌లపై సెంచరీలు సాధించాడు. ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ 2014లో రాజస్థాన్‌ తరఫున ఆడుతూ హైదరాబాద్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. శిఖర్ ధావన్, మోయిసెస్ హెన్రిక్స్, కర్ణ్ శర్మలను ఔట్ చేసి ఈ ఫీట్ అందుకున్నాడు. 


శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా 

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసినందుకు కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు ఐపీఎల్‌ నిర్వాహకులు రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఆ జట్టు స్లో ఓవర్‌రేట్ నమోదు  ఇదే తొలిసారి కావడంతో జరిమానాతో సరిపెట్టారు. మరోసారి ఇది పునరావృతం అయితే కెప్టెన్‌కు రూ.24 లక్షల ఫైన్‌తోపాటు ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం ఏది తక్కువైతే అది.. జరిమానాగా విధిస్తారు. మూడోసారి తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఈ సీజన్‌లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్లో ఓవర్‌రేట్ కారణంగా రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని