Shreyas Iyer: శ్రీలంకపై ఆటను చూసే మీరు అలాంటి ప్రశ్న అడిగారా? ‘షార్ట్‌బాల్‌’ బలహీనతపై శ్రేయస్‌ అసహనం

శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ను (Shreyas Iyer) ఓ ప్రశ్న అసహనానికి గురి చేసింది. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Published : 03 Nov 2023 15:46 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తుది జట్టులో తన స్థానంపై అనుమానాలు ఏర్పడిన సమయంలో శ్రీలంకపై భారత బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు షార్ట్‌ బాల్స్‌ను ఆడే క్రమంలో ఔటై పెవిలియన్‌కు చేరిన సందర్భాలే ఎక్కువ. అయితే, ఈసారి మాత్రం అలాంటి బంతులను కూడా.. బౌండరీలుగా మలిచాడు. ఇక మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ విలేకరి ప్రశ్నకు శ్రేయస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్న అడగడం సరైందేనా..? అని అయ్యర్ ప్రశ్నించడం విశేషం. ఇరువురి మధ్య సంభాషణ ఇలా..

రిపోర్టర్‌: వరల్డ్‌ కప్‌ ప్రారంభమైనప్పటి నుంచి ‘షార్ట్‌ బాల్స్‌’ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి.  ఇవాళ కొన్ని అద్భుత పుల్‌ షాట్లు కొట్టారు. తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మీరు తలపడనున్నారు. ఆ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కొనేందుకు మీరెలా సన్నద్ధమయ్యారు? 

శ్రేయస్‌: ఇది నాకు సమస్య అని మీరు చెప్పడం వెనుక మీ ఉద్దేశం ఏంటి?

రిపోర్టర్: అంటే సమస్య అని కాదు. కానీ, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా..

శ్రేయస్‌ అయ్యర్‌: నాకు ఇబ్బందా? నేను పుల్‌ షాట్లతో ఎన్ని పరుగులు సాధించానో మీరు చూశారా? మరీ ముఖ్యంగా నలుగురు బ్యాటర్లు ఔటైనప్పుడు కూడా అలాంటి షాట్లు ఆడి పరుగులు రాబట్టాను. 

ఆ తర్వాత తన ప్రెస్‌ మీట్‌ను కొనసాగిస్తూ శ్రేయస్‌ మాట్లాడాడు. ‘‘గాయాల నుంచి కోలుకుని వచ్చాక ఆడటం ఎప్పుడైనా సవాలే. ఫీల్డింగ్‌లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన తొలి రోజుల్లో కదలడానికి కూడా ఇబ్బంది పడ్డా. అయితే, ట్రైనర్స్‌, ఫిజియో ఇచ్చిన మద్దతుతో చురుగ్గా మారా. 50 ఓవర్ల పాటు క్రికెట్‌ ఆడటం తేలికైన విషయం కాదు. శరీరంపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లను మా బౌలర్లు కట్టడి చేసిన తీరు అద్భుతం. అదృష్టవశాత్తూ మేం వీరితో తలపడే అవకాశం లేదు. అయితే, వారిని కొన్నిసార్లు నెట్స్‌లో ఎదుర్కొంటుంటాం. ఆ పేస్‌ దాడిపై ఆడటం ఎవరికైనా కఠిన సవాల్‌. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం వెనుక భారత బౌలర్లదే కీలక పాత్ర’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని