Shreyas Iyer: నా ఇబ్బంది చెప్పినా.. అప్పుడు ఎవరూ అంగీకరించలేదు: శ్రేయస్‌

సెంట్రల్ కాంట్రాక్ట్‌ పోయినా సరే తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకొనేందుకు శ్రేయస్‌ అయ్యర్ ప్రయత్నిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్‌ తర్వాత వెన్ను నొప్పి విషయంలో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపాడు.

Published : 26 May 2024 10:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR vs SRH) సిద్ధమైంది. అయితే, నిన్న సాయంత్రం చెన్నైలో వర్షం పడటంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండోర్‌లోనే గడిపేసింది. ఈ క్రమంలో కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవడం, వరల్డ్‌ కప్‌ తర్వాత వెన్ను నొప్పిపై స్పందించాడు. తన ఇబ్బందిని తెలియజేసినా ఎవరూ అర్థం చేసుకోలేదని బాధను వ్యక్తం చేశాడు.

‘‘వన్డే ప్రపంచ కప్‌ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా ఆందోళనలను ఎవరికైనా చెప్పినా అంగీకరించలేదు. అదేసమయంలో నాతో నేనే తీవ్రంగా పోటీ పడ్డా. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమయ్యాక.. నా అత్యుత్తమ సత్తాను నిరూపించుకోవాలని భావించా. లీగ్‌కు ముందు మేం ఎలాంటి ప్రణాళికలతో వచ్చామో.. వాటిని అమలు చేసి ఫలితాలను రాబడుతున్నాం. ఇప్పుడీ స్థానంలో ఉన్నాం. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయి జట్టులో స్థానం లేకపోవడంపై చాలా మంది నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, నేనెప్పుడూ ఒకటే చెబుతా. గతం గురించి పట్టించుకోను. ప్రస్తుతం మన చేతుల్లో ఏముందనేదే ముఖ్యం. అంతేకానీ, జరిగిపోయిన దాని గురించి ఆందోళన పడను. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడపైనే దృష్టిపెడతా ’’ అని వ్యాఖ్యానించాడు. 

ఆ విషయంలో గంభీర్‌ బెస్ట్

కోల్‌కతా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరినా.. ఇదంతా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) వల్లేననే వ్యాఖ్యలు వినిపించడంపై శ్రేయస్ స్పందించాడు. ‘‘ఇదంతా మీరు (మీడియా, సోషల్ మీడియా) చేస్తున్నదే. హైప్‌ క్రియేట్‌ చేసి వదిలేస్తారు. టీ20 ఫార్మాట్‌ను అర్థం చేసుకోవడంలో గంభీర్‌ భాయ్‌ కంటే మరొకరు ఉండరేమో. అతడికి ఆటపై అంత నాలెడ్జ్‌ ఉంది. కేకేఆర్‌కు గతంలో రెండు టైటిళ్లను అందించాడు. ప్రత్యర్థినిబట్టి అప్పటికప్పుడు వ్యూహాలను తయారు చేసుకొని అమలు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఇదే ఉత్సాహాన్ని ఫైనల్‌లోనూ చూపించి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు