Yashasvi - Gil: ఇది ఆరంభం మాత్రమేనన్న యశస్వి.. గత మ్యాచుల్లో పొరపాట్లేమీ చేయలేదన్న గిల్!

భారత యువ క్రికెటర్లు విండీస్‌పై (WI vs IND) నాలుగో టీ20లో అదరగొట్టారు. సిరీస్‌ రేసులో నిలవాలంటే విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో రాణించారు. దీంతో 2-2తో సమంగా నిలిచిన ఇరు జట్లూ ఫైనల్‌లాంటి ఐదో మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాయి.

Published : 13 Aug 2023 14:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో (WI vs IND) తొలి మూడు టీ20ల్లో 3, 7, 6 పరుగులు చేసిన భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కీలకమైన నాలుగో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ (77) చేసి ఫామ్‌లోకి వచ్చిన గిల్ గత మూడు మ్యాచుల్లో విఫలం కావడంపై స్పందించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి 165 పరుగులు జోడించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. 

టీమ్‌ఇండియా ‘హ్యాట్రిక్‌’ కొట్టాలి.. టీ20 సిరీస్‌ పట్టేయాలి!

‘‘తొలి మూడు మ్యాచుల్లో కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయా. నాలుగో టీ20 జరిగిన ఫ్లోరిడా పిచ్‌ కాస్త బెటర్‌గా ఉంది. దానిని ఉపయోగించుకోవాలని భావించా. మంచి ఆరంభం దక్కడంతో మ్యాచ్‌ను కూడా ముగించాలని అనుకున్నా. టీ20 క్రికెట్‌లో ఉండే వైవిధ్యం ఇదే. ఓ మూడు లేదా నాలుగు మ్యాచుల్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో.. ప్రత్యర్థి ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు పడితే పెవిలియన్‌కు చేరక తప్పదు. ఎక్కువగా ఆలోచించి ఆడటానికి పొట్టి ఫార్మాట్‌లో సమయం ఉండదు. అయితే, ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడటం చాలా ముఖ్యం. తప్పులు ఎక్కడ జరిగాయనేది తెలుసుకోగలిగితే పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. అయితే, తొలి మూడు మ్యాచుల్లో పొరపాట్లు ఎక్కడా చేయలేదు. ఆరంభాలను మంచి స్కోర్లుగా మలచలేకపోయా. యశస్వి జైస్వాల్‌తో కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడటం బాగుంది’’ అని గిల్ తెలిపాడు.


 ఎంతో ప్రత్యేకం: యశస్వి

‘‘నా రెండో టీ20 మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. నేడు జరగనున్న ఐదో టీ20 కోసం సిద్ధంగా ఉన్నా. మంచి ఆరంభం దొరికితే దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. భారత్‌ తరఫున ఆడటమే ప్రత్యేకత. ఇక అర్ధశతకం చేయడం మరింత ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనుక చాలా కఠిన శ్రమ, ఆలోచనలు ఉన్నాయి’’ అని యశస్వి జైస్వాల్ వ్యాఖ్యానించాడు. విండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో యశస్వి 51 బంతుల్లోనే 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని