WI vs IND: టీమ్‌ఇండియా ‘హ్యాట్రిక్‌’ కొట్టాలి.. టీ20 సిరీస్‌ పట్టేయాలి!

వెస్టిండీస్‌తో ఐదో టీ20 ఫైనల్‌లాంటిది. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌లో గత జట్టుతో బరిలోకి దిగుతాడా..? లేదా..? అనేది హార్దిక్‌ ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. 

Updated : 13 Aug 2023 14:22 IST

తొలి రెండు మ్యాచుల్లో ఓటమి.. అదీనూ చివరి వరకు వచ్చి మరీ చేజారాయి. ఇక యువకులతో కూడిన జట్టు.. స్వదేశంలో పటిష్ఠమైన విండీస్‌ను (WI vs IND) ఎలా ఎదుర్కొంటుందోననే సందేహాలు మొదలయ్యాయి. పొట్టి సిరీస్‌ చేజారుతుందేమోనని ఆందోళనా రేగింది. ఐదు టీ20ల సిరీస్‌లో 0-2తో టీమ్‌ఇండియా వెనుకబడింది. అయితే కీలకమైన మూడు, నాలుగు టీ20ల్లో మాత్రం అద్భుత విజయాలు సాధించి తామూ సిరీస్‌ రేసులో ఉన్నామని ఘనంగా చాటిచెప్పింది భారత యువ క్రికెట్ జట్టు. మరీ ముఖ్యంగా నాలుగో టీ20లో ఆడిన తీరు అద్భుతం. బ్యాటింగ్‌ పిచ్‌పై విండీస్‌ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడిన వేళ.. భారత యువ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేశారు. ఇదే ఫామ్‌ను ఇవాళ జరగనున్న ఐదో టీ20లోనూ ప్రదర్శిస్తే సిరీస్‌ కైవసం చేసుకోవడం భారత్‌కు కష్టమేం కాదు. హ్యాట్రిక్‌ విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి భారత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తొలుత 0-2తో వెనుకబడి.. 2-2 సిరీస్‌ రేసులో నిలవడం టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇదేనేమో..! 

బౌలర్లు మరోసారి.. 

ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే, అలాంటి పిచ్‌పైనా భారత బౌలర్లు (Team India Bowlers) కష్టపడ్డారనే చెప్పాలి. అయితే, హెట్‌మయెర్, షై హోప్‌ను కూడా కట్టడి చేసి ఉంటే ఇంకాస్త త్వరగానే భారత్‌ గెలిచే అవకాశం ఉండేది. అయితే, ఫైనల్‌లాంటి ఐదో టీ20లో మాత్రం విండీస్‌ బ్యాటర్లను తక్కువగా అంచనా వేయకూడదు. గత మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్, రోవ్‌మన్‌ పావెల్‌ను ఒకే ఓవర్‌లో కుల్‌దీప్‌ యాదవ్ ఔట్ చేసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి భారత బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది. అక్షర్, అర్ష్‌దీప్‌ వికెట్లు తీసినా భారీగానే పరుగులు సమర్పించారు. మూడు మ్యాచుల్లో నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌ను వేసిన కెప్టెన్ హార్దిక్‌ పాండ్య నాలుగో టీ20లో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే సంధించాడు. అందులోనూ 14 పరుగులు ఇవ్వడంతో మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. చాహల్‌, ముకేశ్‌ కూడా ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్‌లోనైనా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమై ఉన్న అవేశ్‌ ఖాన్‌కు అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.

వారిపైనే ఆధారపడొద్దు!

వరుగా రెండు మ్యాచుల్లో భారత్‌ గెలిచేందుకు కారణం యశస్వి, గిల్, సూర్య, తిలక్‌ వర్మ. అయితే ‘ఫైనల్‌’లో మాత్రం మిగతా బ్యాటర్లూ రాణించాలి. అందులో మరీ ముఖ్యంగా సంజూ శాంసన్‌.  మూడు, నాలుగో టీ20ల్లో సంజూకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. అంతకుముందు మ్యాచుల్లో విఫలమై నిరాశపరిచాడు. ఇక చివరి టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం లభిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విఫలం కాకుండా ఉండాలి. ఒకవేళ మరోసారి నిరాశపరిస్తే మాత్రం మళ్లీ జాతీయ జట్టులో అవకాశాలు తగ్గడం ఖాయం. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్ అభేద్యమైన తొలి వికెట్‌కు 165 పరుగులు జోడించడంతోపాటు ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. చివరి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

బాబర్ అజామ్‌తో అదే తొలిసారి మాట్లాడటం.. ఇప్పటికీ అలాంటి గౌరవమే: విరాట్

పిచ్‌ పరిస్థితి, వాతావరణం..

ఒక్క రోజు వ్యవధిలోనే ఒకే మైదానంలో రెండు అంతర్జాతీయ టీ20లు ఆడనుండటం అక్కడి క్రికెట్ అభిమానులకు పండగే. అయితే, ఫ్లోరిడాలోని హ్యుమిడిటీ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈసారి కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకుల అంచనా. మ్యాచ్‌ను జియోసినిమా ఓటీటీ, ఫ్యాన్‌కోడ్‌ ఓటీటీలతోపాటు దూరదర్శన్‌ ఛానల్‌లో వీక్షించొచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

జట్లు (అంచనా):

భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), సంజూ శాంసన్‌ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్‌యాదవ్, అవేశ్‌ ఖాన్/అర్ష్‌దీప్‌, ముకేశ్‌ కుమార్‌

వెస్టిండీస్‌: బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్, షై హోప్, నికోలస్‌ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మయెర్, జాసన్ హోల్డర్, రొమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హుసేన్, మెకాయ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు