Gujarat Vs Mumbai: తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నట్లు గిల్ కనిపించడు: సాయి కిశోర్

భారీ లీగ్‌లో జట్టును నడిపించాలంటే అనుభవం ఉండాలి. కానీ, గిల్ మాత్రం పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.

Published : 25 Mar 2024 13:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి జట్టును గుజరాత్ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓడించింది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ వ్యూహాలతో స్టార్‌ బ్యాటర్లు కలిగిన ముంబయిని కట్టడి చేయగలిగాడు. లక్ష్యం పెద్దది కాకపోయినా.. బౌలర్లను వినియోగించుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో యువ క్రికెటర్ సాయి కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుభ్‌మన్‌ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడిని చూస్తే తొలిసారి సారథ్యం చేపట్టిన కెప్టెన్‌గా కనిపించడు. స్పిన్నర్‌గా నాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. తొలుత మేం 10 పరుగులు తక్కువగా చేశామని భావించాం. కానీ, గత రెండేళ్లుగా జట్టు ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరికీ తెలిసిందే. మేం గెలిచినా.. ఓడినా మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంటాం. చివరి వరకూ పోటీనివ్వాలని మా కోచ్‌ ఆశిశ్‌ నెహ్రా ఎప్పుడూ చెబుతుంటాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం కోసం శ్రమించాం’’ అని సాయి కిశోర్ తెలిపాడు.


ఇంతటి హేళనను చూడలేదు..: కెవిన్ పీటర్సెన్

గుజరాత్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యను హేళన చేస్తూ అహ్మదాబాద్‌ అభిమానులు ప్రవర్తించిన తీరుపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్‌కు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని కెవిన్‌ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ కెప్టెన్సీని వదిలేసి.. ముంబయి సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ టాస్‌ కోసం వచ్చినప్పుడు.. మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో హేళనకు గురైన సంగతి తెలిసిందే. దానిని కెవిన్‌ ప్రస్తావించాడు. ‘‘సొంతగడ్డపై ఈ స్థాయిలో అభిమానులు అరుస్తూ హేళన చేయడం ఇప్పటి వరకు చూడలేదు. చాలా అరుదుగా చోటు చేసుకొనే ఘటన’’ అంటూ తన కామెంట్రీలో వ్యాఖ్యానించాడు.


కోహ్లీ.. ఎప్పటికీ దిగ్గజమే: రిజ్వీ

గత మినీ వేలంలో భారీ ధరకు చెన్నై జట్టు సమీర్ రిజ్వీని సొంతం చేసుకుంది. బెంగళూరుతో జరిగిన ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో అతడికి అవకాశం రాలేదు. కానీ, ఓ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకొనే క్రమంలో.. విరాట్ కోహ్లీతో షేక్‌హ్యాండ్‌ ఇస్తుండగా రిజ్వీ తన టోపీని తలపై నుంచి తీశాడు. సీనియర్లకు అతడు ఇచ్చే మర్యాద ఇదంటూ అభినందిస్తూ నెట్టింట కామెంట్లతో ముంచెత్తారు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిజ్వీ షేర్ చేశాడు. దానికి ‘ఎప్పటికీ దిగ్గజమే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని