Shubman Gill: ‘శుభ్‌మన్‌ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్‌లో దంచికొడతాడు’

టీమ్‌ఇండియా భవిష్యత్‌ స్టార్‌గా ఎదుగుతున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్‌ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.

Updated : 21 Sep 2023 18:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ముందువరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ 24ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన గిల్‌.. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. మరో రెండు, మూడేళ్లలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైరయ్యే అవకాశం ఉంది. దీంతో టీమ్‌ఇండియా భవిష్యత్‌ స్టార్‌గా ఎదుగుతున్న గిల్‌ గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్‌ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్‌ కూడా ఉంటాడని పేర్కొన్నాడు. 

‘‘గిల్ గత ఏడాదిన్నరగా నిలకడగా ఆడుతున్నాడు. మధ్యలో వెస్టిండీస్ టూర్‌లో కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ, ఆసియా కప్‌తో తిరిగి ఫామ్ అందుకుని మంచి స్కోర్లు చేశాడు. అతను సానుకూలంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్‌ కూడా బాగుంది.  సునాయాసంగా 50, 100 పరుగులు చేస్తున్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్‌లో అతి ముఖ్యమైన ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్ కూడా ఉంటాడు. అతను స్టార్‌ ఆటగాడిగా ఎదగాలని, తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడని నాకు తెలుసు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఏర్పడింది. ప్రపంచకప్ తర్వాత మనం తరచూ అతని గురించే మాట్లాడుకుంటాం. అతని హ్యాండ్‌ పవర్ బలంగా ఉంది. ఆ బలాన్ని ఉపయోగించి బలమైన షాట్లు ఆడతాడు. అతనికి ఎక్కడ బౌలింగ్‌ వేయాలో స్పిన్నర్లకు తెలియదు. ఫాస్ట్ బౌలర్లు బంతిని స్వింగ్ చేయకపోతే నేరుగా లేదా ఫ్లిక్‌తో వాటిని బాగా ఆడగలడు. గిల్ దూకుడు ఇక్కడితో ఆగదు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దంచికొట్టాడు. గిల్ ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ మాదిరిగానే రాణిస్తాడు. అతను ఓపెనర్ కావడంతో 50 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దొరికింది. అతడికున్న అడ్వాంటేజ్ ఇదే’’ అని సురేశ్ రైనా జియో సినిమాతో అన్నాడు. గిల్ సెప్టెంబరు 22 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై దృష్టిపెట్టాడు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని