Team India: భారత బ్యాటర్లలో ఎప్పటికీ అతడే బెస్ట్‌: నవ్‌జ్యోత్‌ సిద్ధూ

ప్రతీ తరానికి ఒక్కో అత్యుత్తమ క్రికెటర్‌ వస్తుంటారు. అయితే, ఓవరాల్‌ ఎవరు టాప్‌ ప్లేయర్‌ అని చెప్పడం కష్టమే. కానీ, మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్‌ సిద్ధూ మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Updated : 21 Mar 2024 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ కామెంట్రీలోకి మళ్లీ అడుగుపెట్టిన భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ (Navjot Sidhu) విశ్లేషణలకు పదునుపెట్టాడు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్‌తో (IPL) కామెంట్రీ బాక్స్‌లోకి సిద్ధూ పునరాగమనం చేయనున్నాడు. తాజాగా ఓ ఛానల్‌లో మాట్లాడిన సిద్ధూ భారత్‌ తరఫున అద్భుతంగా ఆడిన బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సునీల్ గావస్కర్, సచిన్‌ తెందూల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరుల్లో ఎవరు బెస్ట్‌ అనేది వెల్లడించాడు. అలాగే ఆర్సీబీ తరఫున కోహ్లీ (Virat Kohli) మూడో స్థానంలో ఆడటమే ఉత్తమం అని వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లో ఎక్కువ భాగం కోహ్లీ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు.

‘‘జట్టు అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు ప్రపంచంలోని గొప్ప క్రికెటర్. అయితే, జట్టు విజయాలు సాధించకపోతే ఎంతటి ఆటగాడైనా ఇబ్బంది పడతాడు. ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ను ఎత్తుకోలేదు. ఇప్పుడు అదంతా వదిలేసి తాజాగా ఆర్సీబీ మొదలుపెట్టాలి. కోహ్లీని తక్కువ చేయడం కాదు. తన జట్టు కోసం అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే, అతడిని భారత్‌ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నేను ఎంపిక చేస్తా. నా క్రికెట్‌ కెరీర్‌లో చాలా తరాలను చూశా. 70ల్లో సునీల్‌ గావస్కర్‌ విండీస్‌పై అదరగొట్టాడు. భీకరమైన బౌలర్లను ఎదుర్కొని మరీ ఆడాడు. మేం తరగతులు ఎగ్గొట్టి మరీ రేడియోల్లో వినేవాళ్లం. దాదాపు 20 ఏళ్లపాటు క్రికెట్‌ను శాసించాడు. 

ఇక సచిన్ తెందూల్కర్ రావడం మరో అద్భుతం. ధోనీ, విరాట్ కోహ్లీ.. ఇలా ప్రతిఒక్కరూ అత్యుత్తమంగా రాణించారు. వీరి నలుగురిలో కోహ్లీకే ఎక్కువ మార్కులు ఇస్తా. మూడు ఫార్మాట్లలో అదరగొట్టేశాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ స్థాయి అద్భుతం. టెక్నికల్‌గానూ ఉత్తమ ఆటగాడు. సచిన్ కూడా తన కెరీర్‌లో చాలాసార్లు గాయపడ్డాడు. ధోనీ ఫిట్‌గా ఉన్నా.. విరాట్ మాత్రం సూపర్ ఫిట్‌ ప్లేయర్. అందుకే, అతడు నిలకడగా జట్టులో ఉంటున్నాడు’’ అని సిద్ధూ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని