Siraj: సిరాజ్‌ మియా.. ఎక్కడ బౌలింగ్‌ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్‌ ఎటాక్!

భారత స్టార్‌ పేసర్‌గా మారిన సిరాజ్‌ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను తేలిగ్గా ఆడేస్తున్నారు.

Published : 30 Mar 2024 13:42 IST

కేవలం బ్యాటింగ్‌తోనే ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవలేరు. ప్రత్యర్థులను బౌలింగ్‌తోనూ కట్టడి చేయాల్సిందే. భారీ స్కోర్లు చేసినా.. బౌలింగ్‌లో విఫలమైతే మ్యాచ్ కోల్పోవడమే. ఇలాంటి పరిస్థితి బెంగళూరు జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సీనియర్‌ బౌలర్‌ సిరాజ్‌ (Siraj)తో కూడిన బెంగళూరు బౌలింగ్‌ విభాగం తేలిపోతోంది. వ్యక్తిగతంగానూ అతడు విఫలం కావడం నిరాశకు గురి చేస్తోంది.. 

టీ20 ప్రపంచ కప్‌ ముందు జరుగుతున్న భారీ లీగ్‌ ఐపీఎల్. వచ్చే పొట్టి కప్‌ కోసం ప్రకటించే జట్టులోకి అడుగు పెట్టాలంటే ఇదొక మార్గం. బ్యాటర్లు ఫామ్‌ అందుకోవడానికి.. బౌలర్లు లయను అందిపుచ్చుకోవడానికి అద్భుతమైన వేదిక ఇదే. కానీ, బెంగళూరు బౌలింగ్‌ విభాగాన్ని నడిపిస్తున్న సిరాజ్‌ మాత్రం గత మూడు మ్యాచుల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. గతేడాది బెంగళూరు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతడే. భారత జట్టులోనూ బుమ్రా, షమీ తర్వాత పేరున్న పేసర్ సిరాజ్‌. గతేడాది ఆసియా కప్‌లో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన సిరాజ్‌..  వన్డే ప్రపంచ కప్‌లో మాత్రం బుమ్రా, షమీ ప్రదర్శన ముందు మరుగున పడ్డాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనైనా రాణిస్తాడనుకుంటే ఇబ్బంది పడుతున్నాడు. మూడు మ్యాచుల్లో 110 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టాడు. చెన్నై, కోల్‌కతా జట్లపై ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.

ఇబ్బంది ఎక్కడ? 

బెంగళూరు పిచ్‌ బ్యాటర్లకు అనుకూలం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, వైవిధ్యంగా సంధిస్తే ఫలితం రాబట్టవచ్చని యువ బౌలర్‌ విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ నిరూపించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచే దానికి ఉదాహరణ. సిరాజ్‌, దయాల్, అల్జారీ జోసెఫ్‌ వంటి బౌలర్లపై ఎదురు దాడి చేసిన కోల్‌కతా బ్యాటర్లు వైశాక్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. 183 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా 17 ఓవర్లలోపే ఛేదించింది. వైశాఖ్‌ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మరి సీనియర్‌ బౌలర్‌ అయిన సిరాజ్‌ 3 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించాడు. అల్జారీ జోసెఫ్‌ కూడా విఫలం కావడం గమనార్హం. బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించే సిరాజ్‌కు ఐపీఎల్‌ కొత్త రూల్‌ (ఓవర్‌కు రెండు బౌన్సర్లు) వరంగా మారాల్సింది. కానీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని గతేడాది ఆసియా కప్‌ ఫైనల్‌లో సిరాజ్‌ శ్రీలంకను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మాత్రం వికెట్‌ వైపే బంతి పడటం లేదు. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వేస్తే ఎలాంటి బ్యాటర్‌ అయినా భయం లేకుండా షాట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. కేవలం వేగాన్ని నమ్ముకోకుండా.. వైవిధ్యం చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

పొట్టి కప్‌ కోసం విపరీతమైన పోటీ..

ఐసీసీ వరల్డ్‌ కప్‌ల్లో ఆడాలనేదే ప్రతి క్రికెటర్ లక్ష్యం. అందుకోసం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సెలక్టర్ల దృష్టిలో పడాలి. జూన్‌ నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. భారత జట్టులోకి అడుగు పెట్టాలంటే సీనియర్లు, కుర్రాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. బుమ్రా, షమీ (ఫిట్‌నెస్‌ సాధిస్తే) సీనియర్ల కోటాలో దాదాపు జట్టులో ఉంటారు. బుమ్రా తన ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత స్థానం కోసం అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షల్‌ పటేల్, తుషార్‌ పాండే, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌ వంటి పేసర్లతో సిరాజ్‌ పోటీ పడాల్సి ఉంటుంది. ఈసారి సీజన్‌లో ఏమాత్రం వెనుకడుగు వేసినా స్క్వాడ్‌లో చోటు దక్కే అవకాశాలు సన్నగిల్లడం ఖాయం. వెస్టిండీస్‌లో పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. యూఎస్‌ఏ వేదికలు మాత్రం బ్యాటర్లకు స్వర్గధామం. అలాంటప్పుడు కేవలం పేస్‌తోనే కాకుండా స్లో బంతులను వేస్తే వికెట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సూత్రాన్ని ఇప్పుడు ఐపీఎల్‌లోని మిగతా మ్యాచుల్లోనూ సిరాజ్‌ పాటిస్తేనే.. సెలక్టర్ల కన్ను అతడిపై పడుతుంది. సిరాజ్‌ మియా బౌలింగ్‌లో మళ్లీ మాయ చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని