Mohammed Siraj: సిరాజ్‌ అలసిపోయాడు.. విశ్రాంతి ఇవ్వండి: బెంగళూరు మేనేజ్‌మెంట్‌కు హర్భజన్‌ సూచన

హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ ఈసారి ఐపీఎల్‌లో తన మాయను ప్రదర్శించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి? సమస్యకు పరిష్కారం ఏంటనేది భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు.

Published : 12 Apr 2024 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత సీజన్‌లో అత్యంత ఘోరమైన ప్రదర్శనతో బెంగళూరు స్టార్‌ బౌలర్ సిరాజ్‌ (Mohammed Siraj) నిరాశ పరుస్తున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ 3 ఓవర్లు వేసిన అతడు వికెట్‌ లేకుండా 37 పరుగులు సమర్పించాడు. ఓవైపు బుమ్రా ఐదు వికెట్లు తీస్తే.. సిరాజ్‌ కనీసం ఒక్కటి కూడా పడగొట్టకపోవడంతో నెట్టింట విమర్శలూ వస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన 15 మంది జాబితాలోనూ సిరాజ్‌ లేడు. ఆరు మ్యాచుల్లో 4 వికెట్లు మాత్రమే తీసి 229 పరుగులు సమర్పించాడు. ఈక్రమంలో బెంగళూరు ఫ్రాంచైజీకి హర్భజన్ సింగ్‌ కీలక సూచనలు చేశాడు.

‘‘ఒకవేళ నేను బెంగళూరు మేనేజ్‌మెంట్‌లో ఉండుంటే.. సిరాజ్‌కు తప్పకుండా విశ్రాంతినిస్తా. కొన్ని మ్యాచ్‌లకు అతడిని దూరంగా పెడతా. కొత్త బంతితో వికెట్లు తీసే అతడు ఇబ్బందిపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమ్‌ఇండియాకు అతడు ఛాంపియన్‌ బౌలర్. బెంగళూరుకూ స్టార్‌ పేసర్. జాతీయ జట్టు తరఫున విపరీతంగా క్రికెట్ ఆడటం వల్ల అతడు బాగా అలసిపోయాడు. మానసికంగా, శారీరంగానూ సిరాజ్‌కు కాస్త విశ్రాంతి అవసరం’’ అని హర్భజన్‌ తెలిపాడు.


ఐపీఎల్‌ 2024లో ఆడకపోవడానికి కారణమదే: జేసన్ రాయ్

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు జేసన్ రాయ్ ప్రస్తుత సీజన్ ఆడకుండా వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదని మెగా లీగ్‌ ప్రారంభానికి ముందు రాయ్‌ ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన మరో ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కోల్‌కతా తీసుకుంది. గతేడాది శ్రేయస్‌ అయ్యర్, షకిబ్ అల్ హసన్ జట్టులో లేనప్పుడు రాయ్‌ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. మరోసారి అతడి ఆటను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. తాను సీజన్‌లో ఆడకపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ రాయ్‌ వెల్లడించాడు. 

‘‘కోల్‌కతా నాపై చాలా నమ్మకం ఉంచింది. నన్ను మళ్లీ రిటైన్‌ చేసుకుని జట్టులో అవకాశం కల్పించింది. కానీ, నేను ఆడటానికి సిద్ధంగా లేకపోవడంతో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా. మేం తొలి మ్యాచ్‌ ఆడే సమయానికి నా కుమార్తె జన్మదినం ఉంది. కుటుంబం కోసం ఉండాలనుకున్నా. అంతేకాకుండా చక్కదిద్దాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు వరకు పెద్దగా మ్యాచ్‌లు కూడా ఆడలేదు. దీంతో ఇక్కడికి వచ్చి నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించలేకపోతే నాపై జట్టుకున్న నమ్మకం పోతుంది. దీంతో నా మానసిక స్థితితోపాటు శారీరకంగా ఫిట్‌నెస్‌ కోసం తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నా’’ అని జేసన్ రాయ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని