Australia: మిగిలిన టీ20లకు ఆసీస్‌ జట్టులో భారీ మార్పులు..!

టీమ్‌ ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఆసీస్‌ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అరడజను మంది ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు.  

Updated : 28 Nov 2023 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో టీ20 సిరీస్‌ మధ్యలో ఆస్ట్రేలియా (Australia) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌, స్టార్‌ బౌలర్‌ ఆడమ్‌  జంపా స్వదేశానికి పయనమయ్యారు. ఈ విషయాన్ని క్రికెట్‌.కామ్‌ వెల్లడించింది. మూడో మ్యాచ్‌ ఆడిన తర్వాత బుధవారం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, ఇంగ్లిస్‌, అబాట్‌ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఇక ప్రపంచకప్‌ హీరో ట్రావిస్ హెడ్‌ మాత్రం జట్టుతోపాటే కొనసాగనున్నాడు. 

ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ను అందించిన ఆ ఒక్క మీటింగ్‌..!

ఆస్ట్రేలియా నుంచి కీపర్‌ జోష్‌ ఫిలిప్‌, హిట్టర్‌ బెన్‌ మెక్‌డెర్మోట్‌ వచ్చి జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక బెన్ డ్వార్షస్‌, స్పిన్నర్‌ క్రిస్‌ గ్రీన్‌ నాలుగో మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి రానున్నారు. ఆసీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని వన్డే కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సమర్థించాడు. టీ20 సిరీస్‌ మధ్యలో సహచరులు వెనక్కి రావడానికి మద్దతు పలికాడు. ప్రపంచకప్‌ జైత్రయాత్ర తర్వాత తమ ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ కోసం సర్వశక్తులు ధారపోసి.. ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్‌లు ఆడటానికి వారేమీ రోబోలు కాదని కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. వారి నిర్ణయాన్ని తాను వ్యతిరేకించనని తెలిపాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రపంచకప్‌ ట్రోఫీని మీడియాకు ప్రదర్శించిన సందర్భంగా పాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ..‘‘గత కొన్ని నెలలుగా మా జట్టు చాలా బిజీగా ఉంది. ఇప్పటికీ ఆసీస్‌కు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ పర్యటనలు తుది జట్టులో స్థానం దక్కించుకోని.. మా యువకులకు సరికొత్త అవకాశాలు ఇవ్వడం సంతోషకరం. వారు ఈ పర్యటనల నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అని అన్నాడు.  

భారత్‌తో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో నిర్ణయాత్మక సమరానికి ఆసీస్‌ సన్నద్ధమైంది. నేడు జరిగే మూడో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఢీకొంటుంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్‌.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని