Ruturaj Gaikwad: అప్పుడూ.. ఇప్పుడూ నా వెంటే ధోనీ భాయ్‌: రుతురాజ్‌ గైక్వాడ్

కోల్‌కతాపై సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నైను గెలిపించడంలో కెప్టెన్ రుతురాజ్‌ (Ruturaj Gaikwad) కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు.

Updated : 09 Apr 2024 11:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెపాక్‌లో చెన్నై హ్యాట్రిక్‌ విజయం సాధించింది. బయటి వేదికల్లో జరిగిన గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన ఆ జట్టుకు ఊరటనిచ్చే గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌ -4లోనే కొనసాగుతోంది. కోల్‌కతాపై కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad)విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌కు వచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. భారీ షాట్లు కొట్టకపోయినా క్రీజ్‌లోకి రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. ఇక తన గురువుతో కలిసి మ్యాచ్‌ను ముగించడంపై రుతురాజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

‘‘ఈ మ్యాచ్‌ గెలిచిన తర్వాత నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఐపీఎల్‌లో నేను తొలిసారి హాఫ్‌ సెంచరీ సాధించినప్పుడు నా పక్కన ధోనీ ఉన్నాడు. ఇప్పుడు కోల్‌కతాపై విజయం సాధించినప్పుడు అతడితో కలిసి ముగించడం బాగుంది. అజింక్య రహానె స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో నేను చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని భావించా. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలంగా లేదు. 160 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. లక్ష్య ఛేదన సమయంలో స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ బౌండరీల కోసం చూడాలి. ఇక్కడ భారీ సిక్స్‌లు కొట్టడం సులువేం కాదు. పవర్‌ ప్లే తర్వాత జడేజా అత్యంత ప్రభావితం చేసే బౌలర్. మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. జట్టులోని ప్రతి ఒక్కరికీ ప్రతి విషయమూ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ధోనీ భాయ్‌ ఉన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఉన్నాడు. ఈసారి సీజన్‌లో నా ఆట నెమ్మదిగా ప్రారంభమైందని అనుకోవడం లేదు. టీ20ల్లో కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. దూకుడుగా ఆడే క్రమంలో అదృష్టమూ కలిసి రావాలి. కోల్‌కతాపై సరైన సమయంలోనే ఫామ్‌ అందుకున్నానని భావిస్తున్నా. నా స్ట్రైక్‌రేట్‌ గురించి విశ్లేషకులు ఏదో ఒకటి మాట్లాడతారు. అయితే, మేం విజయం సాధించడం ఆనందం కలిగించింది’’ అని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. 

ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్‌ను ఆస్వాదిస్తా: జడేజా

ఐపీఎల్‌లో చెన్నై తరఫున అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు అందుకొన్న రెండో ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja). తాజాగా మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో అతడికి ఈ అవార్డు వరించింది. దీంతో ఎంఎస్ ధోనీతో (15) కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సంందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చెపాక్‌ పిచ్‌పై బౌలింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తా. సరైన ప్రాంతంలో బంతులేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. ఇక్కడ చాలా ప్రాక్టీస్‌ చేశా. చెపాక్‌లో పర్యటించే జట్టు కుదురుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఆలోపే వారిని ఔట్‌ చేయడానికి ప్రయత్నించాలి. మాకు ఇక్కడి పిచ్‌ పరిస్థితిపై అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం’’ అని జడేజా తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని