T20 Cricket Effect: పసికూనలు కాదు.. కసికూనలు.. షాక్‌లు మీద షాకులిస్తున్నాయిగా!

క్రికెట్‌లో పెద్ద జట్టును చిన్న జట్టు ఓడించడం అంటే.. ఎప్పుడో ఏడాదికి ఒకసారి అనేలా ఉండేది. కానీ ఇప్పుడు తరచుగా ఈ మాట వింటున్నాం. ఇటీవల న్యూజిలాండ్‌ (NewZeland)ను యూఏఈ (UAE) ఓడించి షాక్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మార్పునకు కారణమేంటో ఓసారి చూద్దాం. 

Published : 20 Aug 2023 17:16 IST

న్యూజిలాండ్ (NewZeland) అంటే ప్రపంచ క్రికెట్‌ (World Cricket)లో పెద్ద జట్లలో ఒకటి. అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేత న్యూజిలాండే. చివరి రెండు వన్డే ప్రపంచకప్పుల్లో రన్నరప్. 2021 టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌. ఇలాంటి జట్టును యూఏఈ (UAE) లాంటి అనామక జట్టు టీ20 మ్యాచ్‌ (T20 Cricket)లో ఓడించి సంచలనం రేపింది. ఇక్కడ ఆశ్చర్యం అంటే.. ఆ ఓటమి చాలా ఘోరంగా ఉండటం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇలా చిన్న జట్లు.. పెద్ద టీంలకు షాకులివ్వడం ఇప్పుడు మామూలైపోతోంది.

యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా విజయం ఆ జట్టునే వరించింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడ్డ కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. ఛేదనలో యూఏఈ పోరాడినప్పటికీ.. సీనియర్ పేసర్ టిమ్ సౌథీ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో ప్రత్యర్థిని 136 పరుగులకు ఆలౌట్ చేసి 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో కష్టపడి నెగ్గిన కివీస్.. రెండో టీ20లో రెచ్చిపోయి ఆడుతుందని, ఘనవిజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశించారు. కానీ రెండో టీ20లో యూఏఈ దెబ్బకు కివీస్ షాక్ తింది. 

మొదట 8 వికెట్లకు 142 పరుగులే చేయగలిగిందా జట్టు. చాప్‌మన్ (63) పోరాడకుంటే ఆ మాత్రం స్కోర్ కూడా చేసేది కాదు కివీస్. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన యూఏఈ కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి కివీస్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఈ విజయం తర్వాత యూఏఈ ఆటగాళ్ల సంబరాలు మామూలుగా లేవు. ఆ దేశ క్రికెట్‌లో ఇదే అతి పెద్ద విజయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఇలా చిన్న జట్లు.. పెద్ద టీంలకు షాకులిస్తే చాలా కాలం దాని గురించి మాట్లాడుకునేవాళ్లం. కానీ టీ20 యుగంలో పెద్ద జట్లను చిన్న టీంలు ఓడించడం తరచుగానే జరుగుతోంది. రెండు నెలల కిందట వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. 

వెస్టిండీస్ లాంటి పెద్ద జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి రావడమే ఆశ్చర్యం అంటే.. ఇందులో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి చిన్న జట్లు ఈ మాజీ ఛాంపియన్‌ను అలవోకగా ఓడించి సంచలనం రేపాయి. స్కాట్లాండ్ నిలకడగా రాణించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇక అఫ్గానిస్థాన్ పసికూన నుంచి కసికూనగా మారి చాలా ఏళ్లయింది. పెద్ద జట్లను ఓడించడం ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్లు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చే స్థాయిలో ఉన్నాయి. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగలమని చాటుతున్నాయి.

టీ20ల పుణ్యమే..

చిన్న జట్ల ఎదుగుదలలో టీ20 క్రికెట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీని వల్ల చిన్న జట్ల ఆటగాళ్లకు మంచి ఎక్స్‌పోజర్ వస్తోంది. ఐదు రోజులు నిలబడి ఆడాల్సిన టెస్టులంటే చిన్న జట్లకు చాలా కష్టం. వన్డేల్లో 50 ఓవర్లు నిలబడటం కొంచెం కష్టమే. కానీ టీ20ల కథ వేరు. ఈ ఫార్మాట్‌లో జట్ల మధ్య అంతరం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌తో ఏమైనా జరిగిపోవచ్చు. ఒక ఆటగాడు కొన్ని ఓవర్లు విధ్వంసం సృష్టిస్తే ఆ జట్టు పైచేయి సాధించవచ్చు. అలాగే ఒక బౌలర్ మెరుపు స్పెల్‌తో ప్రత్యర్థి కుదేలు కావచ్చు. అలాంటి సంచలన ప్రదర్శనలు నమోదైనపుడు మ్యాచ్ ఫలితాలు తారుమారు అయిపోతుంటాయి. 

టెస్టులు, వన్డేల నిర్వహణ అంటే కష్టం కానీ.. టీ20 సిరీస్‌లకు లోటే ఉండట్లేదు. చిన్న జట్ల మధ్య తరచుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నాయి. దీంతో ఆటగాళ్లకు అనుభవం పెరుగుతోంది. ఈ ఫార్మాట్‌లో రాటుదేలుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టీ20ల లీగ్‌లు బోలెడన్ని ఉన్నాయి. భారత ఆటగాళ్లను మినహాయిస్తే.. ప్రపంచవ్యాప్తంగా అన్ని టీ20 లీగుల్లోనూ అన్ని దేశాల ఆటగాళ్లూ ఆడుతున్నారు. ఈ మధ్య టీ10 లీగ్స్ కూడా పెరిగాయి. ఇందులో చిన్న జట్ల ఆటగాళ్లకు మంచి అవకాశం లభిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆటగాళ్లతో కలిసి మ్యాచ్‌లు ఆడుతూ రాటుదేలుతున్నారు. 

అందువల్లే పెద్ద జట్లతో మ్యాచ్‌ల సమయంలో భయం ఉండట్లేదు. ఎలాంటి బౌలర్లు, బ్యాటర్లను అయినా దీటుగా ఎదుర్కొంటున్నారు. టీ20ల అనుభవం కొన్నిసార్లు వన్డేల్లోనూ ఉపయోగపడుతూ ఆ ఫార్మాట్లో కూడా సంచలనాలు నమోదు చేస్తున్నారు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లోనూ అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్ లాంటి జట్ల నుంచి పెద్ద జట్లకు షాకులు ఎదురైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని