Cricket News: ‘హండ్రెడ్‌’ డ్రాఫ్ట్‌లో భారత్‌ నుంచి ఇద్దరికే అవకాశం..

డబ్ల్యూపీఎల్‌లో అదరగొట్టిన ఇద్దరు భారత క్రికెటర్లకు లండన్‌లోని హండ్రెడ్‌ లీగ్‌లో ఆడే అవకాశం దక్కింది. 

Updated : 21 Mar 2024 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌ వేదికగా జరగనున్న హండ్రెడ్‌ లీగ్‌లో భారత్‌ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం వచ్చింది. తాజాగా రూపొందించిన ‘హండ్రెడ్’ డ్రాఫ్ట్‌లో ఆర్సీబీ మహిళా జట్టు సభ్యులను తీసుకొనేందుకు ఆ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. అందులో మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కాగా.. తన బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించిన రిచా ఘోష్‌కు అవకాశం దక్కింది. సౌథరన్‌ బ్రేవ్‌ జట్టుకు మంధాన, బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌ ఫ్రాంచైజీ రిచా వైపు మొగ్గు చూపాయి. ఇప్పటికే మంధాన బ్రేవ్‌ జట్టుతో ఆడిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమెకు కాంట్రాక్ట్‌ దక్కింది. అలాగే రిచాకు ఫోనిక్స్‌ రెండో జట్టు. ఇంతకుముందు లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది. 

భారత్‌ నుంచి మొత్తం 17 మంది ఈ డ్రాఫ్ట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే, బిడ్డర్లు మాత్రం ఇద్దరిని తీసుకొనేందుకు ఆసక్తి చూపించారు. హర్మన్‌ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, శ్రేయాంక పాటిల్‌ తదితరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. డబ్యూపీఎల్‌లో 13 వికెట్లు తీసిన శ్రేయాంకా పాటిల్‌ ఫైనల్‌లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ‘హండ్రెడ్‌’లోకి వచ్చేందుకు భారత ప్లేయర్లకు మరో అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు తమ జట్టులోకి మరొక ఓవర్సీస్‌ క్రికెటర్‌ను తీసుకోవాలని భావిస్తే.. వీరందరికీ వైల్డ్‌ కార్డ్స్‌ ఎంట్రీ ద్వారా ఛాన్స్‌ దక్కే వీలుంది. 

ఆర్సీబీ జట్టు కోసం వచ్చేందుకు కారణమదే: ఆండీ ఫ్లవర్

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను వదిలి ఆర్సీబీ కోచ్‌గా రావడానికి కారణమేంటో ఆండీ ప్లవర్‌ వెల్లడించాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవని నాలుగు జట్లలో ఆర్సీబీ ఒకటని.. ఇదే తాను రావడానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. ‘‘ఐపీఎల్ టైటిల్‌ను సాధించని ఆర్సీబీని ఈసారి విజేతగా నిలపడమే మా లక్ష్యం. ఇలాంటి కఠిన సవాల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నేను ఆర్సీబీ జట్టుకు కోచ్‌గా రావడానికీ కారణమిదే. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఆల్‌రౌండర్లు టోర్నీలో కీలక పాత్ర పోషిస్తారు. నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం. ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శిస్తాం. అదే మమ్మల్ని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్తుంది’’ అని ఆండీ ఫ్లవర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని