IPL 2024: ‘హార్దిక్‌ కెప్టెన్సీ దారుణం’.. సోషల్‌ మీడియా యూజర్‌ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్

రోహిత్ స్థానంలో హార్దిక్‌ పాండ్యను ముంబయి మేనేజ్‌మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్‌ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది.

Published : 28 Mar 2024 14:45 IST

(సోర్స్‌: ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తొలుత గుజరాత్‌ చేతిలో.. ఇప్పుడు హైదరాబాద్‌పై పరాజయం పాలైంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో గుజరాత్‌ టైటిల్‌ను నెగ్గగా.. ఇప్పుడు ముంబయి మాత్రం విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా హార్దిక్‌ సారథ్యంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు మళ్లీ కెప్టెన్సీని రోహిత్‌శర్మకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో ఓ యూజర్‌ పెట్టిన పోస్టుకు భారత మాజీ క్రికెటర్ సూటిగా సమాధానం ఇచ్చాడు. 

‘‘ఐపీఎల్‌ చరిత్రలో నేను ఇప్పటివరకు చూసిన అత్యంత చెత్త కెప్టెన్సీ అతడిదే. వెంటనే అతడు తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబయి అయినా తొలగించాలి’’ అని సదరు అభిమాని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రాను ట్యాగ్‌ చేశాడు. ‘మీరేం అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. సదరు అభిమాని పోస్టుపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘మీకేం అయింది? ఎందుకలా అంటున్నారు? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్‌మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి. మీలోనే ఏదో తేడా ఉంది’’ అని చోప్రా పోస్టు చేశాడు. 

మళ్లీ అదే ప్రశ్న.. బుమ్రా ఎక్కడ?

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేశాడో.. హైదరాబాద్‌తోనూ హార్దిక్‌ పాండ్య తన కెప్టెన్సీలో అవే పునరావృతం చేశాడు. స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌ వేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. మళ్లీ బుమ్రాను 13వ ఓవర్‌లోనే బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. అప్పటికే అభిషేక్, ట్రావిస్ హెడ్‌ హాఫ్ సెంచరీలు సాధించారు.  దీనిని ప్రస్తావిస్తూ.. ఆసీస్‌ దిగ్గజం టామ్‌ మూడీ సోషల్‌ మీడియా వేదికగా ‘‘బుమ్రా ఎక్కడ? మ్యాచ్‌ ఇప్పటికే సగం ముగిసింది. స్టార్‌ బౌలర్‌కు ఒకే ఒక్క ఓవరా ఇచ్చేది?’’ అంటూ పోస్టు పెట్టాడు. బుమ్రాతో 15వ ఓవర్‌, 19వ ఓవర్‌ను పాండ్య వేయించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా వికెట్‌ లేకుండా 36 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించినా.. వారితో పోలిస్తే బుమ్రా మాత్రం పొదుపుగానే వేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని