ODI WC 2023: వాళ్లకు గాయం.. వీళ్లకు వరం.. ప్రపంచకప్‌ ఆడే ఛాన్స్‌ కొట్టేసిన ఆటగాళ్లు

కొన్ని రోజుల ముందు వరకూ అసలు ప్రపంచకప్‌ ఆడతారనే ఆశలే పెట్టుకోలేదు. తమ దేశాల ప్రపంచకప్‌ ప్రాథమిక జట్లలో వీళ్లకు చోటు దక్కకపోవడమే అందుకు కారణం. కానీ కొంతమంది ఆటగాళ్లు గాయపడటంతో వీళ్లకు వరంగా మారింది.

Published : 30 Sep 2023 16:53 IST

రచిన్‌ రవీంద్ర, హసన్‌ అలీ, దుషన్‌ హేమంత, మధుశంక, లిజార్డ్‌ విలియమ్స్, ఫెలుక్వాయో, అశ్విన్‌.. ఈ ఆటగాళ్ల గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? భారత్‌లో అక్టోబర్‌ 5న ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో వివిధ జట్లకు వీళ్లు ఆడబోతున్నారు. అయితే కొన్ని రోజుల ముందు వరకూ వీళ్లు అసలు ప్రపంచకప్‌ ఆడతారనే ఆశలే పెట్టుకోలేదు. తమ దేశాల ప్రపంచకప్‌ జట్లలో వీళ్లకు చోటు దక్కకపోవడమే అందుకు కారణం. కానీ కొంతమంది ఆటగాళ్ల గాయం.. వీళ్లకు వరంగా మారింది. ఇప్పుడు అనుకోకుండా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం కొట్టేశారు. 

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ ఆడటం ఏ క్రికెటర్‌కైనా జీవితకాల లక్ష్యం. అదే ప్రపంచకప్‌ గెలిస్తే అంతకుమించి గొప్ప ఘనతేం ఉంటుంది? అందుకే ప్రపంచకప్‌ ఆడే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆటగాళ్లు పోటీపడతారు. ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైతే ఆనందంలో మునిగిపోతారు. ఈ టోర్నీలో జట్టు విజయం కోసం తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతారు. ఇప్పుడు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ కోసం పది జట్లు సమరానికి సై అంటున్నాయి. అయితే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రాదనుకున్న కొంతమంది ఆటగాళ్లు ఇప్పుడీ మెగా టోర్నీలో ఆడబోతున్నారు. 

టీమ్‌ఇండియాలో..

ప్రపంచకప్‌లోగా కేఎల్‌ రాహుల్‌ శస్త్రచికిత్స నుంచి కోలుకోవాలని, జట్టులోకి రావాలని భారత అభిమానులు బలంగా కోరుకున్నారు. అయితే దీని వెనుక మరో ప్రధాన కారణం కూడా ఉంది. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ గాయంతో దూరమవడంతో ఈ స్థానాన్ని రాహుల్‌ భర్తీ చేయాలని అభిమానులు ఆశించారు. నిరుడు డిసెంబర్‌ చివర్లో రోడ్డు ప్రమాదంలో పంత్‌ గాయపడ్డ సంగతి తెలిసిందే. దీని నుంచి వేగంగా కోలుకుంటున్నప్పటికీ ప్రపంచకప్‌ వరకూ అతను ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ పైనే జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించాలని ఆకాంక్షించింది. ఒకవేళ పంత్‌ ఉండి ఉంటే.. అప్పుడు ఇషాన్‌ కిషన్‌ ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చేవాడే కాదు. అలాగే కేఎల్‌ రాహుల్‌కూ తుదిజట్టులో చోటు కూడా కష్టమయ్యేదనే చెప్పాలి. మరోవైపు ప్రపంచకప్‌లో అక్షర్‌ ఆడటం ఖాయమేననిపించింది. మొదట టీమ్‌ఇండియా ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల జట్టులోనూ అక్షర్‌ ఉన్నాడు. కానీ ఆసియా కప్‌లో గాయంతో ప్రపంచకప్‌కూ దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అనుకోకుండా అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు మెగా సమరంలో సత్తాచాటాలనే పట్టుదలతో అశ్విన్‌ ఉన్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌ గెలిస్తే.. అప్పుడు ఇషాన్, రాహుల్, అశ్విన్‌ అంతటి అదృష్టవంతులు.. పంత్, అక్షర్‌ లాంటి దురదృష్టవంతులు ఉండరనే చెప్పాలి. 

ఇంకా వీళ్లు.. 

పాకిస్థాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌గా బరిలో దిగి 92 పరుగులతో ఆకట్టుకున్నాడు రచిన్‌ రవీంద్ర. అసలైతే అతనీ ప్రపంచకప్‌లో ఆడేవాడే కాదు. కానీ ఆల్‌రౌండర్‌ మైకెల్‌ బ్రేస్‌వెల్‌ పిక్క గాయంతో దూరమవడంతో అతని బదులుగా రచిన్‌ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వహిందు హసరంగ కీలక ఆటగాడిగా ఎదిగాడు. తన లెగ్‌స్పిన్‌తో బ్యాటర్లకు కళ్లెం వేయడమే కాదు.. బ్యాటింగ్‌లోనూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొడతాడు. ఈ ఏడాది లంక ప్రిమియర్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు (279) చేసిన ఆటగాడు, అత్యధిక వికెట్లు (19) తీసిన బౌలర్‌ అతనే. కానీ తొడ కండరాల గాయం అతని పాలిట శాపంగా మారింది. ఇప్పుడదే దుషన్‌ హేమంతకు వరంగా మారి జట్టులో చోటు దక్కేలా చేసింది. లంక పేసర్‌ దుష్మంత్‌ చమీర భుజం గాయం కారణంగా దిల్షన్‌ మధుశంక జట్టులోకి వచ్చాడు.

పాక్‌ యువ పేసర్‌ నసీˆమ్‌ షా ఆసియా కప్‌లో భుజం గాయానికి గురయ్యాడు. అతను ప్రపంచకప్‌ ఆడే అవకాశం లేకపోవడం హసన్‌ అలీకి కలిసొచ్చింది. దక్షిణాఫ్రికా జట్టులో పేసర్లు నోకియా, మగాల స్థానాల్లో వరుసగా లిజార్డ్‌ విలియమ్స్, ఫెలుక్వాయో ప్రపంచకప్‌ ఆడబోతున్నారు. 2019 ప్రపంచకప్‌ సమయంలోనూ నోకియా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున ప్రపంచకప్‌ ఆడే అవకాశం లబుషేన్‌ కొట్టేశాడు. గాయపడ్డ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ బదులుగా బ్యాటర్‌గా లబుషేన్‌ జట్టులోకి వచ్చాడు. 

 - ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు