World Cup 2023: ఈ కెప్టెన్లకు ఏమైంది? ప్రపంచకప్‌లో విఫలమవుతున్న సారథులు

మైదానంలో సరైన సమయంలో సరైన వ్యూహాలు రూపొందిస్తూ.. ప్రతికూల సమయాల్లోనూ ప్రశాంతంగా ప్రణాళికలను అమలు చేస్తూ.. జట్టును విజయాల దిశగా నడిపించడంలో కెప్టెన్‌ది కీలక పాత్ర. ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ.. బౌలర్లను మారుస్తూ.. బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ వికెట్లు సాధించడంలో సారథి ప్రధాన భూమిక పోషిస్తాడు.

Updated : 30 Oct 2023 19:52 IST

మైదానంలో సరైన సమయంలో సరైన వ్యూహాలు రూపొందిస్తూ.. ప్రతికూల సమయాల్లోనూ ప్రశాంతంగా ప్రణాళికలను అమలు చేస్తూ.. జట్టును విజయాల దిశగా నడిపించడంలో కెప్టెన్‌ది కీలక పాత్ర. ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ.. బౌలర్లను మారుస్తూ.. బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ వికెట్లు సాధించడంలో సారథి ప్రధాన భూమిక పోషిస్తాడు. ఓ జట్టు గెలిచిందన్నా.. ఓడిందన్నా అందులో నాయకుడి పాత్ర ఉంటుంది. ఇక అత్యంత తీవ్రత ఉండే ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో అయితే తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని, అంచనాలను అందుకుంటూ జట్టును నడిపించడం కత్తి మీద సామే. ఈ సవాలును దాటి అత్యుత్తమ ప్రదర్శనతో సాగే వాళ్లే జట్టును గెలిపిస్తారు. విజేతలుగా నిలుస్తారు. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం చాలా మంది కెప్టెన్లు ఈ విషయంలో విఫలమవుతున్నారు. వ్యక్తిగత ప్రదర్శనలోనూ వైఫల్యం కొనసాగిస్తూ.. సారథిగానూ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో వెనుకబడుతున్నారు. ఇది ఆయా జట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాబర్‌ అజామ్, టామ్‌ లేథమ్, కమిన్స్, బవుమా, షకిబుల్‌ హసన్, బట్లర్‌ వైఫల్యం ఆయా జట్లను దెబ్బతీస్తోందనే చెప్పాలి. 

జట్టు ఆడుతున్నా.. 

ప్రపంచకప్‌లో కొంతమంది కెప్టెన్లు ఆకట్టుకోలేకపోతున్నా.. ఆయా జట్లు మెరుగైన ప్రదర్శనతో సాగుతుండటంతో వీళ్లపై ఎక్కువ ప్రభావం పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా, న్యూజిలాండ్‌ తాత్కాలిక సారథి లేథమ్, ఆస్ట్రేలియా నాయకుడు కమిన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా బవుమా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. నిలకడగా క్రీజులో నిలబడలేకపోతున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 21.75 సగటుతో కేవలం 87 పరుగులే చేశాడు. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు. అత్యధిక స్కోరు 35 పరుగులు మాత్రమే. ఇక నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి మినహా సారథిగా మాత్రం బవుమాకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇతర బ్యాటర్లు చెలరేగుతుండటంతో బ్యాటింగ్‌లో ఇబ్బంది లేకుండా పోతోంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ జట్టు రాణిస్తోంది. దీంతో ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆ జట్టు సెమీస్‌కు చేరువైంది.

మరోవైపు రెగ్యులర్‌ సారథి విలియమ్సన్‌ గాయంతో దూరమవడంతో లేథమ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ను నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌ పరంగా లేథమ్‌ ప్రదర్శన కూడా గొప్పగా ఏమీ లేదు. 4 ఇన్నింగ్స్‌ల్లో 36.75 సగటుతో 147 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కివీస్‌ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో సాగుతోంది. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. ఈ మ్యాచ్‌ల్లో జట్టును నడిపించడంలోనూ లేథమ్‌ అనుకున్న విధంగా విజయవంతం కాలేకపోతున్నాడు. ఇక ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుసగా రెండు పరాజయాలతో టోర్నీని ఆరంభించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఆ జట్టు విజయాల వెనుక బ్యాటర్లు, బౌలర్ల ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా కమిన్స్‌ ప్రదర్శన కూడా ఉంది. కమిన్స్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 30.66 సగటుతో 92 పరుగులు, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. కానీ అతని సారథ్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. 

జట్టుగానూ విఫలం.. 

ఇక టోర్నీలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాక్‌ జట్టుగానూ విఫలమవుతున్నాయి. దీని వెనుక కెప్టెన్ల వైఫల్యం కూడా ఓ ప్రధాన కారణం. ముఖ్యంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ ఈ సారి ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖర్లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ 6 మ్యాచ్‌ల్లో 17.50 సగటుతో 105 పరుగులు మాత్రమే చేశాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అతను బ్యాటింగ్‌లో ఏ మాత్రం రాణించడం లేదు. కీలక సమయాల్లో వికెట్లు పారేసుకుంటున్నాడు. మరోవైపు ఆ జట్టు దూకుడనేదే టోర్నీలో కనిపించడం లేదు. బౌలింగ్‌లో మార్పులు కూడా కలిసి రావడం లేదు. కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టు కూర్పు కుదరలేదు. బంగ్లాదేశ్‌ కూడా 6 మ్యాచ్‌ల్లో ఒకే విజయంతో తొమ్మిదో ర్యాంకులో ఆ జట్టు కెప్టెన్‌ షకిబుల్‌ హసన్‌ ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నాడు. ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అతను.. టోర్నీలో తగిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మధ్యలో గాయం బారిన పడి తిరిగొచ్చిన షకిబ్‌ 12.20 సగటుతో 61 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక టోర్నీకి ముందు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. భారత పిచ్‌లపై అతను అదరగొడతారనే అనుకున్నారు. కానీ 6 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 207 పరుగులు చేశాడు. అతని లెవల్‌కు ఇది తగని ప్రదర్శనే. ఇక జట్టుగానూ పాక్‌ తడబడుతోంది. 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని