Sony Pictures: భారత్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రసార హక్కులు ఎస్‌పీఎన్‌ఐ సొంతం

న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్‌ క్యాప్స్‌), మహిళల (వైట్‌ ఫెర్న్స్‌) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్‌, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

Published : 28 Mar 2024 21:34 IST

దిల్లీ: న్యూజిలాండ్ పురుషులు (బ్లాక్‌ క్యాప్స్‌), మహిళల (వైట్‌ ఫెర్న్స్‌) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్లపాటు భారత్‌, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 2024 మే 1 నుంచి 2031 ఏప్రిల్ 30 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. 2026-27, 2030-31 వేసవిలో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటనలతో పాటు న్యూజిలాండ్‌లో జరిగే ఇతర ద్వైపాక్షిక టెస్టులు, వన్డేలు, అంతర్జాతీయ టీ20లను ఎస్‌పీఎన్‌ఐ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి. అలాగే, సోనీ లివ్‌ (Sony LIV) యాప్‌లోనూలైవ్‌ స్ట్రీమ్ అవుతాయి. తాజా ఒప్పందంతో ఇప్పటికే ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ), శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)తో ఒప్పందాలు ఉన్న ఎస్‌పీఎన్‌ఐ పోర్ట్‌ఫోలియోలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా చేరినట్టయింది.

న్యూజిలాండ్ క్రికెట్‌తో తమ నూతన భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని ఎస్‌పీఎన్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎన్‌పీ సింగ్ తెలిపారు. ‘‘అసాధారణమైన క్రీడా నైపుణ్యానికి న్యూజిలాండ్‌ పెట్టింది పేరు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన క్రికెట్ జట్లలో ఇదొకటి. ఇలాంటి గొప్ప జట్టుకు, భారత్‌లో ఉన్న అభిమానులకు మధ్య బంధాన్ని మరింతగా బలోపేతం చేయడాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని అన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ ఛైర్ డయానా పుకెటాపు-లిండన్ మాట్లాడుతూ.. ఇది ఇరువురికీ అనుకూల సమయమన్నారు. ‘‘ తమ పోర్ట్‌ఫోలియోలో ప్రపంచ స్థాయి క్రీడా టోర్నమెంట్‌లతో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా భారత్‌లో ప్రీమియర్ స్పోర్ట్స్ కంటెంట్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ భాగస్వామ్యం కోసం మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’’ అని చెప్పారు. కాగా, భారత్‌లో ఎస్‌పీఎన్‌ఐ డిజిటల్ హక్కులు 2024-25, 2025-26 సీజన్‌లలో అమెజాన్‌ ప్రైమ్‌తో కలిసి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని