Sourav Ganguly: హార్దిక్ పాండ్యను ట్రోల్‌ చేయొద్దు: సౌరభ్‌ గంగూలీ

ముంబయి కెప్టెన్సీ మార్పు అంశంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, దిల్లీ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. కెప్టెన్సీ విషయంలో అభిమానులు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను ట్రోల్‌ చేయొద్దని, అలా చేయడం సరికాదని దాదా సూచించాడు.

Published : 07 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 7న) ముంబయితో దిల్లీ తలపడనుంది.  ప్రస్తుతం ఇరుజట్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. దిల్లీ నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో విజయం సాధించగా.. ముంబయి ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల ఖాతా తెరవలేదు. దీంతో ఈ ఇరుజట్లు తలపడే మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ముంబయి కెప్టెన్సీ మార్పు అంశంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, దిల్లీ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. కెప్టెన్సీ విషయంలో అభిమానులు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను ట్రోల్‌ చేయొద్దని, అలా చేయడం సరికాదని దాదా సూచించాడు.

‘‘అభిమానులు హార్దిక్ పాండ్యను ట్రోల్‌ చేయొద్దు. ఇది కరెక్ట్ కాదు. ఫ్రాంచైజీ అతడిని కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్‌గా నియమించడం అనేది క్రీడల్లో సాధారణ విషయం. టీమ్‌ ఇండియాకైనా, ఫ్రాంచైజీ టీమ్‌కైనా ఒకరిని కెప్టెన్‌గా నియమిస్తారు. అయితే, హార్దిక్‌కు ముంబయి పగ్గాలు అప్పగించడమనేది అతడు చేసిన తప్పు కాదు. అది ఫ్రాంచైజీ యజమాని తీసుకున్న నిర్ణయం. ఇక, రోహిత్ శర్మ విషయానికొస్తే.. అతడు అద్భుతమైన ఆటగాడు. టీమ్‌ఇండియా, ఐపీఎల్‌లో ముంబయి తరఫున ఆటగాడిగా, కెప్టెన్‌గా అదరగొట్టాడు’’ అని గంగూలీ వివరించాడు.

ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యను నియమించిన సంగతి తెలిసిందే. ఇది ముంబయి.. ముఖ్యంగా రోహిత్ అభిమానులకు రుచించలేదు. పాండ్యను కెప్టెన్‌గా నియమించినప్పటినుంచి అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. మైదానంలోనూ ‘రోహిత్.. రోహిత్’ అంటూ నినాదాలు చేస్తూ హార్దిక్‌ను హేళన చేస్తున్నారు. అయితే, వీటిని అతడు పెద్దగా పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని