Sourav Ganguly: కోహ్లీని నేను కెప్టెన్సీ నుంచి తప్పించలేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ ఎపిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మరోసారి స్పందించాడు.

Published : 05 Dec 2023 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అప్పట్లో పెద్ద దుమారానికి దారితీసింది. తనను ఆకస్మికంగా సారథ్య బాధ్యతల నుంచి తొలగించారని కోహ్లీ మీడియాతో తెలిపాడు. అప్పటి బీసీసీఐ పెద్దలకు, కోహ్లీకి మధ్య విభేదాలు తలెత్తడంతో కెప్టెన్సీ నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. అప్పుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు (2021-22) ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో వన్డే కెప్టెన్సీపై విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధం. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్‌పై గంగూలీ తాజాగా ఓ షోలో మాట్లాడాడు. విరాట్‌ తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని గంగూలీ మరోసారి వివరణ ఇచ్చాడు. 

‘‘నేను విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీ టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అతడికి ఒక విషయం చెప్పా. కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సూచించా’’ అని గంగూలీ చెప్పాడు. అలాగే రోహిత్‌ శర్మ తొలుత మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటానికి ఆసక్తి చూపలేదని గంగూలీ పేర్కొన్నాడు. ‘‘రోహిత్‌ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. నేను అతడిపై ఒత్తిడితో చివరకు అంగీకరించాడు. కానీ, ఎవరు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నా మైదానంలో బాగా ఆడేది ఆటగాళ్లే. తాను భారత క్రికెట్ అభివృద్ధికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను అంతే. ఇది ఒక చిన్న భాగం’’ అని దాదా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని