Virat Kohli: విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయొద్దు.. రెచ్చగొట్టొద్దు: బౌలర్లకు మాజీ పేసర్ కీలక సూచన

క్రీజ్‌లో పాతుకుపోతే విరాట్ కోహ్లీ (Virat Kohli) డేంజరస్‌ బ్యాటర్. ఒకవేళ ఎవరైనా బౌలర్ స్లెడ్జింగ్‌కు పాల్పడితే మరింత ప్రమాదకరంగా మారతాడు. ఇదే విషయంపై మాజీ పేసర్ ఎన్తిని కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 Aug 2023 17:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీలకు (ODI World Cup 2023) ముందు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మఖయా ఎన్తిని బౌలర్లకు కీలక సూచనలు చేశాడు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. ఈ భారత స్టార్‌ బ్యాటర్‌ను మాత్రం రెచ్చగొట్టద్దొని సూచించాడు. ఎందుకో అలా చేయకూడదనేది కూడా వివరించాడు. ఎలాంటి స్లెడ్జింగ్‌ చేయకుండా తమ పని ఏదో బౌలర్లు చూసుకోవాలని పేర్కొన్నాడు. ‘‘వరల్డ్‌ కప్‌లో విరాట్ కోహ్లీని (Virat Kohli) స్లెడ్జింగ్‌ చేయొద్దు. బౌలర్‌ ఎవరైనా సరే స్లెడ్జింగ్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏమీ అనకుండా ఉంటే.. అతడే విసుగుగా భావిస్తాడు. అప్పుడు ఔట్ చేసేందుకు బౌలర్లకు అవకాశం లభిస్తుంది’’ అని వ్యాఖ్యానించాడు. 

అదృష్టం కలిసిరావాలి.. ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్సీకి నిదర్శనం: గావస్కర్

‘‘విరాట్ కోహ్లీ గురించి మా బౌలర్లకు చెప్పేదొక్కటే. అతడు బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎవరూ ఒక్క మాట కూడా అనొద్దు. మళ్లీ మళ్లీ చెబుతున్నా స్లెడ్జింగ్‌ చేయొద్దు. అలా చేస్తే మాత్రం అతడి చేతుల్లో ఘోర పరాభవం తప్పదు. అతడికి ఇలాంటి పోటీ అంటే చాలా ఇష్టం. ఇలా చేస్తే మాత్రం విరాట్ ఏం కావాలని కోరుకున్నాడో అదే జరుగుతుంది. ఒకవేళ ఎవరూ విరాట్‌ను ఏమీ అనకుండా ఉంటే తప్పకుండా విసుగుగా భావిస్తాడు. అప్పుడు పొరపాట్లు చేసి ఔటయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, విరాట్‌కు బౌలింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు స్మార్ట్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని ఎన్తిని తెలిపాడు. 

ఈ నాలుగే సెమీఫైనలిస్టులు.. 

‘‘భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరతాయి. దక్షిణాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీని తీసుకు వస్తుందని భావిస్తున్నా. మా జట్టులో డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషిస్తారు. రబాడ, నోకియా, ఎంగిడి వంటి టాప్‌ పేసర్లు దక్షిణాఫ్రికా సొంతం. అందుకే, ఈ వరల్డ్‌ కప్‌లో మా జట్టు సెమీస్‌కు చేరగలదని విశ్వసిస్తున్నా. ఐపీఎల్‌లో నోకియా అద్భుతమైన బౌలింగ్‌ సంధించాడు. భారత్‌లోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం కలిసొస్తుంది’’ అని వెల్లడించాడు. అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని