Gavaskar On Rohit Captaincy: అదృష్టం కలిసిరావాలి.. ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్సీకి నిదర్శనం: గావస్కర్

మెగా టోర్నీల్లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌నే అందరూ గుర్తుపెట్టుకుంటారని, అప్పుడే గొప్ప సారథిగా పరిగణిస్తారని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు. ఆ జాబితాలోకి చేరాలంటే అదృష్టం కూడా కలిసి రావాలని పేర్కొన్నాడు.

Published : 29 Aug 2023 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని భారత్‌ (Team India) సాధించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సారథిగా వచ్చి వెళ్లాడు. కానీ, మరో టైటిల్‌ నెగ్గలేదు. కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ స్థానంలోకి వచ్చాడు. ఆసియా కప్‌ 2022ను రోహిత్ సారథ్యంలోనే టీమ్‌ఇండియా ఆడింది. కానీ, పరాభవం తప్పలేదు. ఆ తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. ఇప్పుడు మరోసారి ఆసియా, వన్డే ప్రపంచకప్‌ జరగబోతున్నాయి. స్వదేశంలోనే వన్డే వరల్డ్‌ కప్ (ODI World Cup 2023) జరగనున్న నేపథ్యంలో భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రోహిత్ కెప్టెన్‌గా గౌరవం పొందాలంటే మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియాను విజేతగా నిలపాలి. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా రోహిత్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Rohit Sharma: మేమూ తప్పులు చేయొచ్చు

‘‘ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా.. చివరికి అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణించేది మాత్రం ఐసీసీ ట్రోఫీలను ఎన్ని గెలిపించడానేదానిపైనే ఉంటుంది. ఇప్పుడు జరగబోయే రెండు టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలిపితే తప్పకుండా రోహిత్ శర్మ గొప్ప సారథుల జాబితాలోకి చేరిపోతాడు. రోహిత్‌కు ఆ సత్తా ఉందని భావిస్తున్నా. ఇక జట్టు విషయానికొస్తే.. అందరూ నాలుగో స్థానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, అసలైన సమస్య సరైన ఆల్‌రౌండర్లు లేకపోవడం. 1983, 1985, 2011 వరల్డ్‌ కప్‌ జట్లను గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. అందులో టాప్‌ ఆల్‌రౌండర్లు ఉండేవారు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో కనీసం ఏడు లేదా ఎనిమిది ఓవర్లు వేసేవారు. ఎలాంటి జట్టుకైనా ఇలాంటి ఆటగాళ్లు ఉంటే అదనపు ప్రయోజనం. ధోనీ నాయకత్వంలోని జట్టును చూస్తే.. సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్, సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్‌ చేయగల సమర్థులు. అందుకే, ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. 

ఎంత అద్భుతమైన టాలెంట్‌తో కూడిన జట్టు ఉన్నప్పటికీ కొంచెం అదృష్టం కలిసిరావాలి. నాకౌట్ స్టేజ్‌లో తీవ్రంగా కష్టపడినా లక్‌ ఉంటే విజయం సొంతమవుతుంది. గత వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఇలానే భారత్‌ త్రుటిలో ఓటమిపాలైంది. రెండో రోజుకు చేరడంతో వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా వేశారు. అందుకే, కాస్త అదృష్టం కూడా ఉండాలని చెబుతా’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని