Gerald Coetzee: వచ్చాడు జూనియర్‌ స్టెయిన్‌.. ప్రపంచకప్‌లో ఆకట్టుకుంటున్న కొయిట్జీ

అతడికి డేల్ స్టెయిన్‌ ఆరాధ్య బౌలర్. స్టెయిన్‌ మాదిరిగానే తలకు కట్టు.. వేగం.. రనప్‌ ఒకేలా ఉంటాయి. ఇప్పుడీ కొత్త స్టార్‌ దక్షిణాఫ్రికాకు అదనపు బలంగా మారాడు. 

Published : 24 Oct 2023 16:49 IST

తలకు బ్యాండ్‌.. బుల్లెట్‌ వేగం.. వైవిధ్యం.. వికెట్‌ పడితే సంబరాలు చేసుకునే తీరు.. ఇవన్నీ చూస్తే ఠక్కున దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ను గుర్తుకొస్తాడు. ఎందుకంటే 23 ఏళ్ల గెరాల్డ్‌ కొయిట్జీ అనుసరించేది.. ఆరాధించేది స్టెయిన్‌నే కాబట్టి! సఫారీ క్రికెట్లో దూసుకొచ్చిన ఈ పేసర్‌..  మెరుపు వేగంతో ఆకట్టుకుంటూ స్టెయిన్‌ బాటలోనే సాగుతున్నాడు. అందుకే సఫారీ క్రికెట్లో కొయిట్జీని జూనియర్‌ స్టెయిన్‌ అంటారు. తన ఆరాధ్య బౌలర్‌ మాదిరే అదరగొడుతున్న ఈ కుర్రాడు.. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ అతడు 3 వికెట్లు పడగొట్టాడు. కొయిట్జీ కేవలం బౌలర్‌ మాత్రమే కాదు లోయర్‌ఆర్డర్‌లో హార్డ్‌ హిట్టింగ్‌ చేసే బ్యాటర్‌ కూడా. 

స్విమ్మర్‌గా మొదలెట్టి..

నిజానికి బ్లూమ్‌ఫౌంటీన్‌కు చెందిన కొయిట్జీ ఆరంభంలో క్రికెటర్‌ అవుదామని అనుకోలేదు. స్విమ్మింగ్‌ను ఇష్టపడ్డాడు. అయితే సోదరుడు క్రికెటర్‌ కావడంతో అతడినీ ఈ ఆట ఆకర్షించింది. తన అన్నతో పోటీపడి బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నించేవాడు. సోదరుడికి అతడికి మధ్య 3 ఏళ్ల వయసు అంతరం.  అయినా అన్నతో సమానంగా వేగంగా బంతులు వేయడమే లక్ష్యంగా కొయిట్జీ బౌలింగ్‌ చేసేవాడు. నిజానికి స్టెయిన్‌తో పాటు మోర్నీ మోర్కెల్‌ను కూడా కొయిట్జీ బాగా ఇష్టపడేవాడు. వీరిలాగే పొడగరి అయిన అతడు బంతిని వీలైనంత వేగంగా విసిరేందుకు ప్రయత్నించేవాడు. దేశవాళీలో 28.10 సగటుతో 59 వికెట్లు తీసిన కొయిట్జీ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలోనూ అదరగొట్టి జాతీయ జట్టు తలుపు తట్టాడు. 

మెరుపు వేగం

స్థిరంగా 150 కి.మీ వేగంతో బంతులు వేసే బౌలర్‌గా పేరు తెచ్చుకున్న కొయిట్జీ కేవలం 13 దేశవాళీ మ్యాచ్‌లతోనే జాతీయ జట్టు తలుపు తట్టాడు. ఈ ప్రదర్శన అతడికి 2022లో డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టులో చోటు సంపాదించిపెట్టింది. అయితే ఈ సిరీస్‌లో అతడికి సఫారీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో కొయిట్జీ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇదే ఏడాది మార్చిలో విండీస్‌పైనే కెరీర్‌లో తొలి వన్డే ఆడాడు. తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా 2 టెస్టు మ్యాచ్‌ల్లో అతడు 9 వికెట్లు సాధించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో 20.90 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడీ పేసర్‌. మొత్తంగా 8 వన్డేల్లో 15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 3 టీ20 ఆడి 3 వికెట్లు తీశాడు.

టెస్టు క్రికెట్టే మక్కువ

స్టెయిన్‌తో పాటు మోర్నీ మోర్కెల్‌ను కూడా బాగా ఇష్టపడే కొయిట్జీ.. వేగానికి వైవిధ్యాన్ని జోడిస్తూ బ్యాటర్లను బుట్టలో వేస్తాడు. ఎంత వేగంగా బంతులు వేస్తాడో.. అంతే తెలివిగా స్లో బంతులతో మాయ చేస్తాడు. బుల్లెట్‌ యార్కర్లను సంధిస్తాడు. భయపెట్టే బౌన్సర్లను ప్రయోగిస్తాడు. ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లోనూ అతడు ఇలాగే బౌలింగ్‌ చేసి సఫలమయ్యాడు. ఈ తరం కుర్రాళ్లు టీ20 క్రికెట్లో మునిగి తేలుతుంటే కొయిట్జీకి మాత్రం టెస్టు క్రికెట్‌ ఎంతో ఇష్టం. ఈ వేగంగా బంతులు వేస్తాడో.. అతే ఫార్మాట్లో అయితే  బౌలర్‌గా నిరూపించుకోవడానికి చాలా ఉంటుందని నమ్ముతాడనతను. తన హీరో స్టెయిన్‌ను కలవడం అతడి దగ్గర నుంచి విలువైన సలహాలు పొందడం కొయిట్జీకి బాగా కలిసొచ్చింది. ఒక రకంగా స్టెయినే అతడికి మెంటార్‌. కొయిట్జీ ఇదే జోరుతో కొనసాగితే స్టెయిన్‌ మాదిరే దూకుడైన పేసర్‌గా నిలిచిపోవడం ఖాయం.  

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు