FIFA: ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ఫుట్‌బాల్‌ బాస్‌పై స్పెయిన్‌ పీఎం ఆగ్రహం

ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023ను తొలిసారి గెలిచిన సంతోషంలో ఉన్న స్పెయిన్‌(Spain)ను ముద్దువివాదం వెంటాడుతోంది. ఆ దేశ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్ ప్రవర్తించిన తీరే అందుకు కారణం. 

Published : 23 Aug 2023 12:05 IST

మాడ్రిడ్‌: ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 (FIFA Women's World Cup) ఛాంపియన్‌గా స్పెయిన్‌ (Spain) అవతరించిన సంగతి తెలిసిందే. సంబరాల్లో భాగంగా స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్‌ క్రీడాకారుణులకు ముద్దులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. దానిపై ఆయన క్షమాపణలు చెప్పినా.. ఆరోపణలు ఆగడం లేదు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఖెజ్‌ మాట్లాడుతూ.. ఆ సారీ ఏమాత్రం సరిపోదన్నారు.

ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి స్పెయిన్ తొలి ఫిఫా మహిళ ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ.. స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో పెదాలను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో స్పెయిన్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై అడిగిన ప్రశ్నకు ప్రధాని పెడ్రో స్పందిస్తూ.. ‘ఆయన చెప్పిన క్షమాపణలు సరిపోవు. ఆ అభ్యంతరకర ప్రవర్తనపై మరింత స్పష్టత ఇవ్వాలి’ అని అన్నారు. అయితే ఫెడరేషన్‌ స్వతంత్రంగా పనిచేస్తుందని, దాని ప్రెసిడెంట్‌ను నియమించే, తొలగించే అధికారం స్పెయిన్‌ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

అమ్మాయి వద్దనుకుంటే.. ఛాంపియన్‌ పుట్టింది

తన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడంతో లూయిస్ ఇదివరకే క్షమాపణలు తెలియజేశారు. ‘నేను చేసింది తప్పు కావొచ్చు. దానిని అంగీకరించాలి. అమితమైన సంతోష సమయంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా జరిగిన చర్య అది’ అని అన్నారు. కానీ.. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఫెడరేషన్ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని