Kiss Row: ఆ ముద్దుకు నేను అంగీకరించలేదు: స్పష్టత ఇచ్చిన క్రీడాకారిణి

స్పెయిన్‌ దేశం తొలిసారి ఫిఫా మహిళల ప్రపంచకప్‌(FIFA Women's World Cup) టైటిల్‌ను అందుకుంది. ఈ క్రమంలో క్రీడాకారిణులకు మెడల్స్ అందిస్తున్నప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.  

Updated : 26 Aug 2023 11:06 IST

మాడ్రిడ్‌: ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 (FIFA Women's World Cup)లో తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్(Spain) జట్టు తన విజయంతో కంటే.. వివాదంతోనే అందరినోళ్లలో నానుతోంది. స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్‌..  స్టార్‌ ప్లేయర్ అయిన జెన్ని హెర్మోసో(Jenni Hermoso) పెదాలను చుంబించడమే అందుకు కారణమైంది. దీంతో స్పెయిన్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వివాదంపై హెర్మోసో స్పందించారు. ఆ ముద్దుకు తాను అంగీకరించలేదని వెల్లడించారు. 

స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రూబియాలెస్(Luis Rubiales) రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించగా.. రూబియాలెస్‌ తన చర్యను సమర్థించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే అలా వ్యవహరించినట్లు చెప్పారు. ఈ సమాధానంపై హెర్మోసో స్పందించారు. ‘ఈ విషయంపై నేను మీకు స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆయన నాకు ఇచ్చిన ముద్దుకు నేను ఏ సమయంలోనూ అంగీకారం తెలపలేదు’ అని వెల్లడించారు.

ప్రణయ్‌.. సాధించెన్‌

మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణుల యూనియన్ ఫుట్‌ప్రో విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఆ విషయం వెల్లడించారు. ఫెడరేషన్‌లో ప్రస్తుత నాయకత్వం కొనసాగితే తాము క్రీడల్లో పాల్గొనమని ఫుట్‌ప్రో స్పష్టం చేసింది. నాయకత్వ మార్పులు జాతీయ జట్టు ఎదగడానికి దోహదం చేస్తాయని తెలిపింది. అలాగే ఈ వివాదం మహిళల ఫుట్‌బాల్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని దెబ్బతీయడం ఎంతగానో బాధిస్తోందని పేర్కొంది.

ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి స్పెయిన్ తొలి ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ.. స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో పెదాలను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారడంతో స్పెయిన్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే శుక్రవారం అందుకు రూబియాలెస్ నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని