ప్రణయ్‌.. సాధించెన్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మిగతా భారత క్రీడాకారులందరూ నిష్క్రమించిన వేళ.. చివరి ఆశగా బరిలోకి దిగిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌.. పతకం ఖాయం చేసుకుని అభిమానులకు ఊరటనిచ్చాడు.

Updated : 26 Aug 2023 06:36 IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం
క్వార్టర్స్‌లో అద్భుత విజయం
సాత్విక్‌-చిరాగ్‌ జోడీ నిష్క్రమణ

కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నా.. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడిస్తున్నా.. మేజర్‌ టోర్నీల్లో టైటిళ్లు, పతకాలు మాత్రం హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కు అందని ద్రాక్షే! ప్రస్తుతం భారత అత్యుత్తమ షట్లర్లలో ఒకడైన ఈ కేరళ ఆటగాడు ఎట్టకేలకు కెరీర్లో ఓ పెద్ద ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్నాడు. వరుసగా రెండో పర్యాయం పతకం సాధిస్తారనుకున్న స్వాతిక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ మాత్రం ఆ ఘనతకు అడుగు దూరంలో ఆగిపోయింది.

కోపెన్‌హాగెన్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మిగతా భారత క్రీడాకారులందరూ నిష్క్రమించిన వేళ.. చివరి ఆశగా బరిలోకి దిగిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌.. పతకం ఖాయం చేసుకుని అభిమానులకు ఊరటనిచ్చాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 8వ సీడ్‌ ప్రణయ్‌ 19-21, 21-18, 21-8తో ప్రపంచ నంబర్‌వన్‌, టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌)పై అద్భుత విజయం సాధించాడు. తనపై 7-2తో మెరుగైన రికార్డున్న అక్సెల్సన్‌తో పోరులో ప్రణయ్‌ తొలి గేమ్‌ ఓడిపోయి కూడా పుంజుకుని మ్యాచ్‌ గెలిచిన తీరు అమోఘం. ఆరంభ గేమ్‌ హోరాహోరీగా సాగినప్పటికీ.. అక్సెల్సన్‌ నిలకడగా ఆధిక్యంలోనే ఉన్నాడు. 12-17తో వెనుకబడ్డ దశలో ప్రణయ్‌ పుంజుకుని వరుసగా అయిదు పాయింట్లతో స్కోరు సమం చేసినా.. చివరికి గేమ్‌ ప్రత్యర్థికే సొంతమైంది. రెండో గేమ్‌ ఆరంభంలోనే ప్రణయ్‌ 1-7తో వెనుకబడటంతో అతడి పనైపోయినట్లే అనిపించింది. కానీ ప్రణయ్‌ పట్టు వదల్లేదు. గొప్పగా పోరాడాడు. 15-15తో స్కోరు సమం చేశాడు. 17-17 వద్ద ప్రణయ్‌ దూకుడుగా ఆడి అక్సెల్సన్‌కు షాకిచ్చాడు. వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌ విజయానికి చేరువయ్యాడు. అక్సెల్సన్‌ అతణ్ని అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ అనూహ్యంగా ఏకపక్షమైంది. అప్పటికే అలసిపోయిన అక్సెల్సన్‌ ప్రణయ్‌ దూకుడు ముందు నిలవలేకపోయాడు 5-5 వద్ద విజృంభించిన అతను.. వరుసగా పాయింట్లు కొల్లగొడుతూ 16-6తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత ప్రణయ్‌ విజయం లాంఛనమే అయింది.
సాత్విక్‌కు నిరాశే: నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి, మరోసారి పతక ఫేవరెట్లుగా టోర్నీలో అడుగు పెట్టిన సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టిలకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచిన ఈ జోడీకి కిమ్‌ ఆస్ట్రప్‌-ఆండర్స్‌ స్కారుప్‌ జోడీ చెక్‌ పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో భారత ద్వయం 18-21, 19-21తో డెన్మార్క్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ఒక్కసారీ ఆధిక్యం సాధించకపోయినప్పటికీ చివర్లో ప్రత్యర్థుల స్కోరుకు చేరువగా వచ్చి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్‌-చిరాగ్‌.. రెండో గేమ్‌లో 15-15తో స్కోరు సమం చేసి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు మళ్లించేలా కనిపించింది. ఇక్కడి నుంచి ప్రతి పాయింట్‌ కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగింది. కానీ ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ప్రత్యర్థి జోడీ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని