Virat Kohli: విరాట్‌కు ఆ శతకాలెంతో ప్రత్యేకం

వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకంతో మెరిశాడు. ఆసీస్‌పై సెంచరీ సాధించే అవకాశం వచ్చినా.. చేజార్చుకున్నాడు. ఇప్పుడు బంగ్లాపై అద్భుతంగా ఒడిసిపట్టాడు.

Updated : 20 Oct 2023 16:28 IST

క్రికెట్లో శతకం అంటే ఎంతో స్పెషల్‌. అలాంటిది వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) లాంటి మెగా ఈవెంట్లో మూడంకెల స్కోరు సాధిస్తే ఆ ఆనందమే వేరు. సెంచరీల మీద సెంచరీలు చేసే విరాట్‌ కోహ్లి (Virat Kohli).. తానాడిన నాలుగు ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా చేసిన శతకాలు మూడు మాత్రమే! ఇందులో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌ల్లో చేసినవే రెండు. అందుకే ఈ మూడు సెంచరీలు అతడికెంతో అమూల్యం. ఇవి భిన్నమైన క్రికెట్‌ తరాల మధ్య.. ఇంకా భిన్నమైన పరిస్థితుల్లో సాధించడమే ఇందుకు కారణం. 2011లో కుర్రాడిగా జట్టులోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు.. 2015లో ఓ స్టార్‌గా ఎదిగినప్పుడు.. 2023లో కింగ్‌గా ఏలుతున్నప్పుడు.. అతడీ సెంచరీలు సాధించాడు. 

దిగ్గజాల నీడలో

2011 ప్రపంచకప్‌లో సచిన్‌ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి దిగ్గజాల నీడలో కుర్రాడిగా వచ్చిన కోహ్లి గురించి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సీనియర్‌ ఆటగాళ్లకు అతడు కాస్త తోడ్పాటు ఇస్తే చాలని అభిమానులు అనుకున్నారు. ఈ క్రమంలోనే అతడు బంగ్లాదేశ్‌పై తొలి ప్రపంచకప్‌ సెంచరీ చేసి ఉనికి చాటుకున్నాడు. తాను ఎవరనేది ప్రపంచ తెరపై చాటి చెప్పాడు. ఒత్తిడిలోనూ రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. 83 బంతుల్లోనే 100 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.

ఈసారి మరింత మధురం

2011లో ఒక సెంచరీ సాధించినా.. ఆ తర్వాత నాలుగేళ్లు విరాట్‌ ఎంతో ఎదిగాడు. ఛేదనలో మొనగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించడంతో భారత క్రికెట్లే బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారాడు. అలాంటి స్థితిలో వచ్చిన 2015 ప్రపంచకప్‌లో కోహ్లి కీలక సమయంలో సెంచరీతో తన స్థాయిని చాటుకున్నాడు. అయితే 2011లో మిడిల్డార్‌లో వచ్చి శతక్కొట్టిన విరాట్‌.. పాక్‌పై మూడో స్థానంలో వచ్చి సెంచరీతో మెరిశాడు. శిఖర్‌ ధావన్‌తో అతడు వేసిన పునాదే ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయానికి కారణమైంది.

8 ఏళ్ల తర్వాత 

2015 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి జైత్రయాత్ర మామూలుగా సాగలేదు. పరుగులు ప్రవాహంలా వచ్చాయి. కానీ 2019 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం అతడికి శతకం దక్కలేదు. 5 అర్ధసెంచరీలు సాధించాడు కానీ వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. ఆస్ట్రేలియాపై 82 పరుగులు చేయడమే అతడికి అత్యధికం. ఈ నేపథ్యంలో తాజా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై  మూడంకెలను అందుకోవడం కోహ్లికి ఎప్పుటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే 8 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో వచ్చిన సెంచరీ ఇది. వన్డేల్లో 48వ శతకం. ఎప్పటిలా దూకుడుగా ఆడకుండా.. సాహసాలు చేయకుండా ఎంతో పద్ధతిగా కొట్టిన శతకమిది. ఇదే జోరు కొనసాగిస్తే ఈ టోర్నీలో కోహ్లి మరిన్ని శతకాలు సాధించే అవకాశాలున్నాయి. వన్డేల్లో 50 శతకాల క్లబ్‌లోనూ చేరే ఛాన్సూ ఉంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని